తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ashada Masam 2024: రేపటి నుంచే ఆషాడ మాసం ప్రారంభం.. కొత్త దంపతులు దూరం.. దూరం, ఎందుకో తెలుసా?

Ashada masam 2024: రేపటి నుంచే ఆషాడ మాసం ప్రారంభం.. కొత్త దంపతులు దూరం.. దూరం, ఎందుకో తెలుసా?

Gunti Soundarya HT Telugu

05 July 2024, 18:11 IST

google News
    • Ashada masam 2024: జులై 6వ తేదీ నుంచి ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన దంపతులు దూరంగా ఉండాలి. పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఎందుకు తీసుకొచ్చారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. 
రేపటి నుంచే ఆషాడ మాసం ప్రారంభం
రేపటి నుంచే ఆషాడ మాసం ప్రారంభం

రేపటి నుంచే ఆషాడ మాసం ప్రారంభం

Ashada masam 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే నాలుగో నెలని ఆషాడ మాసంగా చెబుతారు. ఆషాడ మాసం అనగానే కొత్తగా పెళ్లయిన జంట దూరంగా ఉండాలని విషయం ఎక్కువగా గుర్తుకు వస్తుంది. రేపటి నుంచి ఆషాడ మాసం ప్రారంభం కాబోతుంది.

జూలై 6వ తేదీ నుంచి ఆగస్ట్ 4వ తేదీ వరకు ఆషాడ మాసం ఉంటుంది. ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్రాలు చంద్రుడికి దగ్గరగా రావడం వల్ల ఈ మాసాన్ని ఆషాడ మాసం అని పిలుస్తారు.

ఆషాడ మాసం ప్రాముఖ్యత

ఆషాడ మాసానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయం మొత్తం ఆధ్యాత్మికత, భక్తిభావం, దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఆషాడ మాసం జ్యోతిష్య శాస్త్రపరంగానే కాకుండా మతపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో మహావిష్ణువు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గామాతతో సంబంధం కలిగిన గుప్త నవరాత్రులు ఈ మాసంలోనే వస్తాయి. ఆషాడ మాసం నుంచి పండగలు ప్రారంభమవుతాయని చెబుతారు.

మత విశ్వాసాల ప్రకారం ఆషాడ మాసంలో ఎక్కువగా పూజలు, హవనాలు, యాగాలు నిర్వహిస్తారు. జగన్నాథుడి రథయాత్ర, దేవశయని ఏకాదశి, చాతుర్మాసం, వారాహి నవరాత్రులు, కర్కాటక సంక్రాంతి ఈ మాసంలోనే వస్తాయి. ఆషాడమాసంలోనే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఈ గుప్త నవరాత్రులని వారాహి నవరాత్రులుగా పిలుస్తారు.

తొలి ఏకాదశి, బోనాలు

ఇక జూలై 17న దేవశయని ఏకాదశి వస్తుంది. దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నుంచి పండుగలు వస్తాయని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఇదే మాసంలో వస్తాయి. ఆషాడ అమావాస్య వచ్చిన తర్వాత గురువారం నుంచి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఆషాడ మాసం చివరి రోజున చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఆషాడ మాసంలో వచ్చే దేవశయని ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. నాలుగు నెలల అనంతరం దేవుత్థాన ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల సమయంలో శుభకార్యాలను నిషేధిస్తారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. విష్ణుమూర్తిని, శివుడిని సూర్యుడిని, దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు. దానధర్మాలు చేస్తూ యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో గొడుగు, మట్టి కుండలు దానం చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం.

కొత్త దంపతులు దూరం.. దూరం

ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులు నెలరోజుల పాటు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో గర్భం దాల్చడం వల్ల సరిగ్గా వేసవి కాలానికి ప్రసవం జరుగుతుంది. ఎండాకాలంలో తల్లీబిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని భావించి పూర్వీకులు ఈ నెలలో కొత్తగా పెళ్లి అయిన దంపతులను దూరంగా ఉండమనే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు.

ఆషాడ మాసం నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది. వ్యవసాయ పనులు మొదలవుతాయి. వర్షాల వల్ల రైతుల విత్తనాలు చల్లుకుంటూ ఎక్కువగా పొలంలోనే గడుపుతారు. కొత్తగా పెళ్ళైన యువకుడు అత్తారింట్లో ఉంటే వ్యవసాయ పనులు సాగవని కూడా అంటారు. అందుకే అమ్మాయిని పుట్టింటికి పంపిస్తారు. వేసవి నుంచి చల్లటి వాతావరణం లోకి రావడం వల్ల ఇన్ఫెక్షన్స్ స్వరాలు తలనొప్పి వంట వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ మాసంలో ఎక్కువగా రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఈ సమయంలో కొత్తగా పెళ్ళైన దంపతులు దగ్గరగా ఉంటే గర్భం వస్తుందని అంటారు. ఈ సమయంలో స్త్రీలు గర్భం ధరించడం మంచి సమయం కాదని భావిస్తారు. అందుకే ఈ సమయంలో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదని కూడా నమ్ముతారు.

కర్కాటక సంక్రాంతి ఈ నెలలోనే

సూర్యుడు ప్రతినెల తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. అలా ఆషాడ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. జులై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సూర్యుడు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం