Chaturmas 2024: చాతుర్మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఈ సమయంలో ఏం చేయకూడదు? ఏం చేయాలి?
Chaturmas 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం మరికొద్ది రోజుల్లో చాతుర్మాసం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలుసుకుందాం.
Chaturmas 2024: సనాతన ధర్మంలో చాతుర్మాసంలో శుభకార్యాలు నిషిద్ధం. ప్రతి సంవత్సరం చాతుర్మాసం ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు వస్తుంది. ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని అంటారు.
చాతుర్మాసం నాలుగు నెలల పాటు ఉంటుంది. దేవశయని ఏకాదశితో ప్రారంభమై కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి అయిన దేవుత్థాన ఏకాదశితో ముగుస్తుంది. దేవశయని ఏకాదశి నుండి శ్రీ హరివిష్ణువు తన నాలుగు నెలల నిద్రను ప్రారంభిస్తాడని చెబుతారు. కార్తీక మాసంలోని దేవుత్థాని ఏకాదశి నాడు విష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడని చెప్తారు. ఆరోజు నుంచి మళ్ళీ వివాహాలతో సహా అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం చాతుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ నెలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే వివరాలు తెలుసుకుందాం.
చాతుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
దృక్ పంచాంగ్ ప్రకారం చాతుర్మాసం ఈ సంవత్సరం జూలై 17 నుండి ప్రారంభమవుతుంది. 12 నవంబర్ 2024న దేవుత్థాన ఏకాదశితో ముగుస్తుంది. ఈ కాలంలో విష్ణు మూర్తి నిద్ర యోగంలో ఉంటారని నాలుగు నెలల తర్వాత మేల్కొంటారని నమ్ముతారు.
చాతుర్మాసంలో ఏం చేయాలి?
చాతుర్మాసంలో విష్ణువు, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఉపవాసం ఆచరిస్తారు. పేదలకు, నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం, ధనదానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తామసిక ఆహారాన్ని త్యజించాలి.
ఈ సమయంలో సుందర్ కాండ, గీత లేదా రామాయణం పఠించడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. ఇది మాత్రమే కాకుండా విష్ణు సహస్రనామం పఠించడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి.
చాతుర్మాసంలో గోదానం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల భక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా నిలిచి ఉంటుందని విశ్వసిస్తారు. విష్ణుమూర్తికి తులసి అంటే మహా ప్రీతి. ఈ కాలంలో ప్రతిరోజూ తులసి మొక్కకు పూజ చేసి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. చాతుర్మాస సమయంలో మంచంపై కాకుండా నేలపై పడుకోవాలి.
చాతుర్మాసంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీ దేవితో పాటు శివ-గౌరీ, వినాయకుడిని తప్పనిసరిగా క్రమపద్ధతిలో పూజించాలి.
చాతుర్మాసంలో ఏమి చేయకూడదు?
చాతుర్మాసంలో శుభకార్యాలు నిషేధం. ఈ సమయంలో పెళ్ళిళ్ళు వంటి వాటిని నిర్వహించారు. అలాగే ఈ కాలంలో కొత్త ఆస్తి కొనుగోలు లేదా గృహ ప్రవేశం చేయడం మానుకోవాలి. వివాహం, నిశ్చితార్థం సహా అన్ని శుభకార్యాలు చాతుర్మాస సమయంలో నిషేధించబడ్డాయి.
ఈ నెలలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా మానుకోవాలి. కోపం, ఇతరులను చూసి అసూయపడటం, అబద్ధాలు ఆడటం, అహంకారం వంటి భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. చాతుర్మాస సమయంలో జుట్టు, గడ్డం కత్తిరించడం నిషిద్ధంగా భావిస్తారు. ఇది మాత్రమే కాదు ఈ కాలంలో నూనె పదార్థాలు, పాలు, పంచదార, పెరుగు, నూనె, బెండకాయలు, పచ్చి ఆకు కూరలు, వెల్లుల్లి, పెసర పప్పు వంటి వాటికి దూరంగా ఉండాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.