Lighting diya rules: దీపం అకస్మాత్తుగా ఆరిపోతే అశుభమా? దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?-is it really bad to lamp suddenly goes off what are the rules to follow lighting diya ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lighting Diya Rules: దీపం అకస్మాత్తుగా ఆరిపోతే అశుభమా? దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Lighting diya rules: దీపం అకస్మాత్తుగా ఆరిపోతే అశుభమా? దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jun 15, 2024 12:00 PM IST

Lighting diya rules: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దీపం పెట్టకుండా ఏ రోజు ఉండరు. హిందూ సంప్రదాయంలో దీపం వెలిగించడానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే కొన్ని సార్లు దీపం అకస్మాత్తుగా ఆరిపోతుంది. ఇది అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.

దీపం అకస్మాత్తుగా ఆరిపోతే అశుభమా?
దీపం అకస్మాత్తుగా ఆరిపోతే అశుభమా? (pixabay)

Lighting diya rules: ప్రతి ఒక్కరూ పూజలో తప్పని సరిగా దీపం వెలిగిస్తారు. ఈ పని చేయనిదే ఆ పూజకు అర్థం ఉండదు. ఉదయం, సాయంత్రం కొంతమంది పూజ చేసుకుని దీపం వెలిగించడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. ప్రతి శుభ కార్యం దీపం వెలిగించకుండా పూర్తి కాదు. ఈ ఆచారం శుభప్రదంగా పరిగణిస్తారు.

నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో ప్రతికూల శక్తి అనేది ఉండదని భక్తుల విశ్వాసం. అలాగే దీపం వెలిగించడం వల్ల అనేక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి పవిత్రమైన దీపం వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి అనుసారం దీపం వెలిగించడం వల్ల పుణ్య ఫలాలు పొందుతారని, కోరిన కోరికలు నెరవేరతాయని నమ్ముతారు. పూజించేటప్పుడు దీపం వెలిగించడానికి ఉన్న వాస్తు నియమాలు, దాని ప్రభావాల గురించి తెలుసుకుందాం.

1. దీపం వెలిగించేటప్పుడు వత్తి ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. పూజలో నెయ్యి దీపం వెలిగించిన వెంటనే ఇతర నూనె దీపాలను వెలిగించకూడదు.

2. దీపాన్ని తూర్పు ముఖంగా ఉంచడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఒత్తిడి తగ్గుతుంది.

3. దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు, జ్ఞానం పెరుగుతాయి.

4. దీపాన్ని పడమర వైపు ఉంచడం వల్ల జీవితంలో ఆటంకాలు వస్తాయి. ఆందోళన పెరుగుతుంది.

5. దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల హాని కలుగుతుంది. అడ్డంకులు కూడా ఏర్పడతాయి.

6. హిందూ మతం ప్రకారం దీపాన్ని ప్రార్థనా స్థలం మధ్యలో, దేవుని విగ్రహం ముందు ఉంచాలి.

7. నూనె దీపంలో ఎరుపు వత్తిని ఉపయోగించడం శ్రేయస్కరం. ఇంటి దీపానికి దూదిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయి

రాహువు, కేతువు దోషాలు జాతకంలో ఉంటే అనేక ఇబ్బందులు కలుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. దీని నుంచి తప్పించుకునేందుకు అవిసే గింజల నూనెతో దీపం వెలిగించడం మంచిది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందటంతో పాటు జాతక దోషాలు కూడా తొలగిపోతాయి.

శని దేవుడి ఆశీస్సులు ఉంటే పేదవాడు కూడా రాజులాంటి జీవితం గడుపుతాడని పండితులు చెబుతారు. అటువంటి శనీశ్వరుడి అనుగ్రహం పొందటం కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా శనివారం రోజుల శనీశ్వరుడి ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది.

ఇక దుర్గాదేవి అనుగ్రహం కోసం నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నూనె దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు నిలుస్తాయి.

దీపం ఆరిపోవడం అశుభమా?

కొంతమంది పూజ చేసే సమయంలో హఠాత్తుగా దీపం ఆరిపోతుంది. ఇలా జరిగిందంటే చాలా మంది అశుభంగా భావిస్తారు. ఏదో కీడు జరగబోతుంది అనే దానికి సంకేతమని, అశుభం జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరవని అనుకుంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే.

దీపం ఆరిపోవడానికి వత్తిలో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం కారణం కూడా కావచ్చు. అలాగే గాలి తగిలినప్పుడు దీపం ఆరిపోతుంది. ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళన చెందకుండా దేవుడికి క్షమాపణలు చెప్పుకుని మళ్ళీ దీపం వెలిగిస్తే సరిపోతుంది. అలాగే దీపం కొండెక్కింది అనాలి. దీపం కొండెక్కే వరకు ఉండాలి మన అంతట మనం ఎప్పుడూ ఆర్పకూడదు. అది అశుభం.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel