Ekadashi: ఏకాదశి అంటే ఎవరో తెలుసా? ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారంటే-do you know who ekadashi how much importance is given to this tithi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ekadashi: ఏకాదశి అంటే ఎవరో తెలుసా? ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారంటే

Ekadashi: ఏకాదశి అంటే ఎవరో తెలుసా? ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారంటే

Gunti Soundarya HT Telugu
May 17, 2024 07:00 PM IST

Ekadashi: హిందూమతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు. అయితే ఈ ఏకాదశి అంటే ఎవరో తెలుసా?

ఏకాదశి అంటే ఎవరో తెలుసా?
ఏకాదశి అంటే ఎవరో తెలుసా?

Ekadashi: హిందూమతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు, అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజుని ఏకాదశిగా పిలుస్తారు. ఏకాదశి ఒక సంస్కృత పదం. దీని అర్థం 11.

ఏకాదశి తిథి అంటే విష్ణువుకి అత్యంత ఇష్టమని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏకాదశి అనేది ఒక దేవత అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అసలు ఈ దేవత ఎవరు? ఆమెకు ఏకాదశికి ఉన్న సంబంధం ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.

ఏకాదశి ఎవరు?

పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు. త్రిమూర్తుల మీదకు యుద్ధానికి దిగాడు. దేవతలందరినీ ఇబ్బందులకు గురి చేయసాగాడు. దీంతో రాక్షసుడి నుంచి కాపాడమని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి మురాసురిడితో యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగినా ఎవరికి గెలుపు, ఓటమి రాలేదు.

ఈ సమయంలో విష్ణుమూర్తి అలసట తీర్చుకోవడానికి ఒక గుహలోకి వెళతాడు. అప్పుడు మురాసురుడు విష్ణువు నిద్రలో ఉండగా సంహరించాలని గుహ దగ్గరకు వెళ్తాడు. అక్కడికి వచ్చిన సంగతి గ్రహించిన విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి పేరే ఏకాదశి.

ఏకాదశి అంటే దేవత. ఆమె తన కంటిచూపుతోనే రాక్షసుడని భస్మం చేసింది. విష్ణుమూర్తి ఆమె భక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఆరోజు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని కొలుస్తారో వారి పాపాలు విముక్తి కలగాలని కోరుకుంటుంది. అలా ఆమె కోరికను విష్ణుమూర్తి అంగీకరించారు.

ఏకాదశి ఉపవాస ప్రాముఖ్యత

ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే నియమాలు పాటిస్తారు. దశమి రోజు నుంచే మాంసం, ఉల్లిపాయలు, పప్పు, బియ్యం వంటి పదార్థాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు కాల కృత్యాలు తీర్చుకోక ముందే నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకొని నమిలి నీటితో పుక్కిలించాలి. ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించాలి.

ఏకాదశి రోజు చిన్న ప్రాణికి కూడా హాని చేయకూడదు. వెంట్రుకలు, గోర్లు కత్తిరించకూడదు. వీలైనంతవరకు ఏకాదశి రోజు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటే విష్ణు అనుగ్రహం లభిస్తుంది.

ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనసు, ఆత్మ శుద్ధి అవుతుంది. భక్తి భావం పెరుగుతుంది. దైవానుగ్రహం పొందుతారు. స్వీయ క్రమశిక్షణ వృద్ధి చెందుతుంది. అలాగే ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది .శరీర బరువు అదుపులో ఉంటుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner