Ashada masam bonalu: బోనాల జాతర సందడి షురూ.. ఆషాడ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు?
Ashada masam bonalu: ఆషాడ మాసం వచ్చిందంటే భాగ్యనగరం బోనాల జాతరతో సందడిగా ఉంటుంది. అయితే ఈ మాసంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకుందాం.
Ashada masam bonalu: మరికొద్ది రోజుల్లో ఆషాడ మాసం ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు బోనాల పండుగకు సిద్ధమవుతున్నాయి. జులై 7 నుంచి ఆషాడ మాస బోనాలు మొదలుకాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
బోనాలు మహంకాళి అమ్మవారిని పూజించే హిందూ పండుగ. జులై 7 ఆషాడంలో వచ్చే మొదటి ఆదివారంతో బోనాలు ప్రారంభమవుతాయి. ఈ పండుగ మొదటి, చివరి రోజు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. స్త్రీలు ఈ పండుగను జరుపుకుంటారు.
కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో పాలు, బెల్లం, బియ్యం వేసి పరమాన్నం చేస్తారు. వేప ఆకులు, పసుపు, కుంకుమతో కుండను అలంకరిస్తారు. మహిళలు అందంగా ముస్తాబై తల మీద ఈ కుండను మోస్తూ ఆలయాలకు తీసుకుని వెళతారు. గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, డొక్కాలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మారెమ్మ, నూకలమ్మ మొదలైన రూపాలలో కాళికా దేవిని పూజిస్తారు. మహిళలు తాము సిద్ధం చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.
ఆషాడ మాసంలో ఎందుకు చేస్తారు?
పురాణాల ప్రకారం ఆషాడ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. అందుకే ఈ పండుగ సమయంలో పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వస్తారు. అమ్మవారిని తమ కూతురిగా భావించి భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు చేసి సమర్పిస్తారు. ఈ తంతును గతంలో ఊరడి అనే వాళ్ళు తర్వాత కాలంలో బోనాలు పేరుగా మారింది.
దుష్ట శక్తులను పారద్రోలేందుకు పూర్వం దున్నపోతును ఆలయంలో బలి ఇచ్చే వారు. ఇప్పుడు వాటికి బదులుగా కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది. బోనాల సందర్భంగా మహిళలు పట్టుచీరలు, నగలు ధరించి అందంగా ముస్తాబు అవుతారు. బోనాలు తీసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని నమ్ముతారు. వారిని శాంతపరిచేందుకు ఆలయం దగ్గర బోనం ఎత్తిన మహిళ కాళ్ళ మీద నీళ్ళు పోస్తారు.
హైదరాబాద్ లో జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు. తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు.
అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక వ్యక్తి బోనాలకు ప్రాతినిధ్యం వాహిస్తాడు. ఎరుపు రంగు ధోతి ధరించి, కాళ్ళకు గంటలు ధరిస్తాడు. శరీయం అంతా పసుపు కుంకుమ రాసుకుంటాడు. నుదుటి మీద పెద్ద బొట్టు ధరించి డప్పులకు తగినట్టుగా నృత్యం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటాడు. ఇతన్ని పూజా కార్యక్రమాలకు ఆరంభకుడిగా భావిస్తారు. పోతురాజు లేకుండా బోనం సందడే లేదు.
ఆషాడ మాసంలో వర్షాలు మొదలవుతాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం వల్ల అంటు వ్యాధులు ప్రబలడం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులను నయం చేయమని ప్రజలు గ్రామదేవతలకు ఉత్సవాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆచారంగా వచ్చింది. పసుపు కలిపిన నీరు ఊరంతా చల్లుకుంటూ వేపాకులు పట్టుకుంటూ ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్ళేవాళ్ళు. ఇలా చేయడం వల్ల అమ్మవారు శాంతించి వ్యాధులు ప్రబలకుండా అడ్డుకుంటుందని ప్రజల విశ్వాసం. అందుకే ఈ బోనాలు జరుపుకుంటారు. ఇందులో ఉపయోగించే పసుపు, వేపాకులు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉన్నాయి.
విందు
బోనం అనేది అమ్మవారికి నైవేద్యం సమర్పించే పండుగ. కుటుంబాలు కూడా ఈ నైవేద్యాన్ని అరగిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులతో పంచుకుంటారు.
రంగం
పండుగ మరుసటి రోజు ఉదయం రంగం జరుగుతుంది. ఒక స్త్రీ మీదకు మహంకాళి అమ్మవారు ఆవహించి భవిష్య వాణి పలుకుతుందని భక్తుల విశ్వాసం.
ఘటం
అమ్మవారి ఆకారంగా అలంకరించే రాగి కలశాన్ని ఘటం అంటారు. పూజారి ఈ అమ్మవారి ప్రతిమగా కలశాన్ని తీసుకుని వెళతాడు. ఘటాన్ని ఉత్సవాల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నీటిలో నిమజ్జనం చేసి ఊరేగింపుగా తీసుకుని వెళతారు. రంగం తర్వాత ఘటం ఉత్సవం జరుగుతుంది. డప్పులు, మేళ తాళాల మధ్య ఊరేగింపుగా పూజారి ఘటాన్ని తీసుకుని వెళతారు. లాల్ దర్వాజా నుంచి నయాపుల్ వరకు ఈ ఘటం ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించింది.