Duryodhana temple: దుర్యోధనుడికి దేవాలయం.. ఎక్కడో కాదు భారతదేశంలోనే ఉంది, ఇక్కడ నైవేద్యం ఏంటో తెలుసా?
Duryodhana temple: మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ప్రధాన కారకుడిగా దుర్యోధనుడిని భావిస్తారు. కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా చేస్తే దుర్యోధనుడికి ఒక ఆలయం ఉంది. అది ఎక్కడో కాదు భారతదేశంలోనే ఉంది.
Duryodhana temple: భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఉన్న ఆలయాలు ప్రతీ దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎన్నో రహస్యాలు కలిగిన ఆలయాలు ఉన్నాయి. కొన్నింటిలో దేవతలు, పురాణాల కారణంగా కొన్ని దేవాలయాలు ప్రత్యేకమైనవిగా నిలిచాయి. అటువంటి వాటిలో ఒకటి ఈ దుర్యోధన దేవాలయం.
కేరళలోని కొల్లం జిల్లాలోని మలనాడ గ్రామంలో ఈ దుర్యోధన దేవాలయం ఉంది. దీన్ని పొరువాజి పెరువీరుత్తి మలనాడ దుర్యోధన దేవాలయం అని పిలుస్తారు. భారతీయ ఇతిహాసం మహాభారతంలో దుర్యోధనుడు కీలకమైన వ్యక్తి.
కుట్రలు, కుతంత్రాలు చేస్తూ అహంకారం, ప్రతికారం తీర్చుకునే వ్యక్తి దుర్యోధనుడు. మహాభారతం యుద్ధం జరగడానికి దుర్యోధనుడే ప్రధాన కారణం అని చెబుతారు. ధృతరాష్ట్రుడి వందమంది కుమారులలో దుర్యోధనుడు ప్రధముడు. కౌరవులకు అగ్రజుడు. సుయోధనుడు అనే మరొక పేరు కూడా ఉంది. అతని చర్యలు విధ్వంసం, నష్టానికి దారి తీసాయి. భారతీయ పురాణాలలో అత్యంత దూషించబడిన వ్యక్తిగా దుర్యోధనుడి పేరు వినిపిస్తుంది. అయితే అంతటి క్రూరుడికి కూడా భారతదేశంలో ఒక ఆలయం ఉంది .వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం.
దుర్యోధన ఆలయం వెనుక పురాణ కథ
స్థల పురాణం ప్రకారం 12 సంవత్సరాల వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేసేందుకు పాండవులు వెళ్లారు. ఈ సమయంలో పాండవులు జాడ తెలిస్తే వాళ్ళని మరో 12 ఏళ్ల పాటు అడవుల పాలు చేయాలని కుట్ర పన్నుతాడు. అందుకోసం తన సైన్యాన్ని దేశం నలుమూలలా పంపిస్తాడు. కానీ ఎవరికీ పాండవుల జాడ తెలియలేదు.
అప్పుడు దుర్యోధనుడు స్వయంగా పాండవులను వెతికేందుకు పయనమయ్యాడు. ఆ సమయంలో మలనాడ ప్రాంతంలోని అడవుల గుండా ప్రయాణించాడు. పాండవుల కోసం వెళ్తున్నప్పుడు కేరళ అడవుల గుండా ప్రయాణించాడు. మలనాడ ప్రాంతంలో దుర్యోధనుడు ఆశ్రయం పొందాడని అక్కడ అతనికి ఆహారం కల్పించి సాదరంగా స్వాగతించాలని నమ్ముతారు. వారి ఆతిథ్యం మెచ్చిన దుర్యోధనుడు ఆ గ్రామాన్ని ఆశీర్వదించాడు.
అందుకు గుర్తుగా ఈ గ్రామస్తులు దుర్యోధనుడి జ్ఞాపకార్థంగా ఆలయం స్థాపించారు. ఇది మాత్రమే కాదు ఇక్కడ కౌరవులు, దుశ్శాస, దుస్సలకు అంకితం చేసిన ఆలయాలు కూడా ఉన్నాయి. పవిత్రేశ్వరం వద్ద కౌరవులు మామ శకునికి అంకితం చేసిన ఆలయం కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం కొల్లం, తిరువనంతపురం, అలప్పుజ, పతనం తిట్ట జిల్లాలలో ఇలాంటి 101 ఆలయాలు చాలా ఉన్నాయట.
విగ్రహం లేని దేవాలయం
ఈ ఆలయానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో దుర్యోధనుడి విగ్రహం ఉండదు. కేవలం యువరాజును సూచించే ఒక ఎత్తైన వేదిక మాత్రమే ఉంటుంది. ఇక్కడి ప్రజలు విగ్రరాధన చేయరు. అది మాత్రమే కాదు ఈ ఆలయంలోని భక్తులు దేవతను దేవుడిగా సంబోధించరు. ఆయనను అప్పుపన్ అని పిలుస్తారు. అంటే మలయాళంలో తాత అని అర్థం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో ప్రధాన నైవేద్యం కల్లు.
కేరళ టూరిజం వెబ్ సైట్ ప్రకారం ఆలయంలోని పూజారి ఇప్పటికే కౌరవ సమాజానికి చెందినవాడు. ఒక వార్త నివేదిక ప్రకారం ఇక్కడ పూజారి సంస్కృత మంత్రాలు ఏవి పఠించదు. కేవలం మలయాళంలో దేవుడిని ప్రార్థించి ఆశీర్వాదం కోరతాడు. ఈ ఆలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. కులమతాలకు అతీతంగా భక్తులకు ఈ ఆలయం స్వాగతం చెబుతుంది.
దుర్యోధన ఆలయంలో పండుగలు
ఈ ఆలయం ఎంతో శక్తివంతమైన పండుగలు, విలక్షణమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులోనే ముఖ్యమైన వార్షిక పండుగ మహాము కెట్టుకజ్చా. మహా మలక్కుడ మహోత్సవంలో భాగంగా ఇది జరుపుకుంటారు. ఇక్కడ ఏడుప్పు కల అని పిలిచే పెద్ద నిర్మాణాలు గ్రామం వీధుల్లో ఊరేగిస్తారు. మలనాడ మహోత్సవం లో పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు పాల్గొంటారు.
మలనాడ దుర్యోధన దేవాలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా సాంస్కృతిక మత సామరస్యానికి ప్రతీక. కులం మతంతో సంబంధం లేకుండా ఈ ఆలయంలో ఏ పండుగ జరిగిన అందులో పాల్గొనడానికి అందరూ వస్తారు. ఆలయ నిర్మాణం కేరళ సంప్రదాయ శైలిలో ఆకట్టుకుంటుంది. ప్రశాంతమైన సుందరమైన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది.