Sankranti festival 2024: ఏడాదిలో ఇన్ని పండుగలు ఉన్నా సంక్రాంతి పెద్ద పండుగని ఎందుకు అంటారో తెలుసా?
Sankranti festival 2024: సంక్రాంతి గురించి ఎవరి నోట విన్నా అబ్బో అది చాలా పెద్ద పండుగ అని అనడం వింటూనే ఉంటాం. పెద్ద పండుగని ఎందుకు అంటారో తెలుసా?
Sankranti festival 2024: ఏడాది మొత్తం పండుగలు ఉన్నప్పటికీ సంక్రాంతిని అందరూ పెద్ద పండుగ అంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అందుకే దీన్ని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనే దానికి సంకేతం.
కొత్త బియ్యంతో వంటలు
సంక్రాంతి సమయానికి రైతులు ఎంతో కష్టపడి శ్రమించిన పంట చేతికి వస్తుంది. పొలాల నుంచి వచ్చే ధాన్యంతో రైతుల మనసులో సంతోషంగా ఉంటారు. అందుకే కొత్త బియ్యంతో నిండైన మనసుతో పొంగల్ పెట్టుకుని అందరికీ పంచి పెడతారు. తమ సంతోషాన్ని ఈ రూపంలో ఇతరులతో పంచుకుంటారు. అయితే ఇంటికి చేరిన కొత్త బియ్యం తింటే అరగదని వాటితో పిండి వంటలు చేసుకుంటారు. దానికి బెల్లం జోడించి పరమాన్నం చేసుకుని తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపినందుకు గాను భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇతరులతో కలిసి పంచుకుంటూ తింటారు.
సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్య భగవానుడికి సమర్పించే నీటిలోనూ నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులు వినియోగిస్తారు. నువ్వులు శరీరానికి వేడి చేస్తాయి. మారుతున్న ఉష్ణోగ్రతలకి అనుగుణంగా నువ్వులు తిని శరీరాన్ని వాతావరణాన్ని తట్టుకునేలా సిద్ధం చేసుకుంటారు.
పెద్దలకు తర్పణాలు
సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టె విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు.
ధనుర్మాసం ముగింపు
సంక్రాంతి పండుగతోనే ధనుర్మాసం ముగుస్తుంది. నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడని నమ్ముతారు. గోదాదేవి శ్రీ రంగనాథుడి కోసం ధనుర్మాస వ్రతం చేసి వివాహ మాడి ఆయనలో ఐక్యమైన రోజు ఇదే. అందుకే గోదా కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇక ధనుర్మాసం ముగియడంతో పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోతుంది. శుభకార్యాలు జరిగేందుకు అనువైన సమయం.
ఇంటికి కొత్త అల్లుళ్ల రాకతో సందడి
తెలుగు రాష్ట్రాలకి సంక్రాంతి చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా అనిపిస్తారు. అల్లుడికి అన్ని రకాల వంటలు చేసి తమకి వారి మీద ఉన్న ప్రేమ, గౌరవం చాటుకుంటారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు.
ఇక పురుషులు అందరూ ఒక చోట చేరి కోడి పందేలు, ఎడ్ల పోటీలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. గోదావరి ప్రాంతం వైపు సంక్రాంతి రోజు కొన్ని లక్షల్లో కోడి పందేలు జరుగుతాయి. వాటిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇక చిన్నా పెద్దా అని తేడా లేకుండా గాలి పటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. ఆకాశంలో రంగు రంగుల గాలి పటాలు ఎగురుతూ కనువిందు చేస్తాయి. మరి ఇన్ని విశేషాలు ఉన్న సంక్రాంతి పెద్ద పండగే కదా.