Dhanurmasam: ధనుర్మాసంలో వివాహాలు జరగకపోవడానికి కారణాలు ఇవే
Dhanurmasam: ధనుర్మాసంలో ఎవరూ ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ సమయంలో ఎందుకు పెళ్ళిళ్ళు చేయరంటే..
Dhanurmasam: సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య సమయంమే ధనుర్మాసం. ఈ మాసంలో పెళ్ళిళ్ళు, ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ నెల రోజులు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం భక్తులు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం చేస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల పెళ్లి కాని ఆడపిల్లలకి తమ మనసుకి నచ్చిన కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్ముతారు.
ధనుర్మాసంలో అందరూ తిరుప్పావై వ్రతాన్ని నిష్టగా పాటిస్తారు. ఈ సమయంలో ఎటువంటి అలంకారాలు చేసుకోరు. భోగ పదార్థాలు తీసుకోరు.భోగభాగ్యాలకు దూరంగా ఉంటూ ఎంతో పవిత్రంగా వ్రతం ఆచరిస్తారు. ఈ నెల రోజులు ఆండాళ్ళమ్మ పూజ, తిరుప్పావై పఠనం చేస్తారు. ఈ మాసంలో పెళ్లిళ్ళు చేయకపోవడానికి శాస్త్రపరమైన, భౌతికపరమైన కారణం కూడా ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుకే ఆహారంపై కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఈ తరుణంలో శుభకార్యాలకి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండరు.
భోగినాడు గోదాదేవి, శ్రీ రంగనాథుల కళ్యాణంతో ఈ వ్రతం ముగుస్తుంది. ఈ సమయంలో కళ్యాణం, శుభకార్యాలు చేయరు. అందుకే దీన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఆ మరుసటి రోజు మకర సంక్రాంతి జరుపుకుంటారు.
ధనుర్మాస వ్రత నియమాలు
విష్ణువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుని నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. రోజూ విగ్రహానికి ఆవుపాలు, పంచామృతం, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి. మొదటి 15 రోజులు బియ్యం, పెసరపప్పుతో మిగతా పదిహేను రోజులు దద్దోజనంతో నైవేద్యం పెట్టాలి. ఈ నెల రోజులు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. మహావిష్ణువుని ఎంతో ప్రీతికరమైన మాసం ఇది.
తెల్లవారజామునే నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడు నీటిని సమర్పించడం(అర్ఘ్యం) చేయాలి. ఇలా చేస్తే సూర్యుడు ఆరోగ్యంతో పాటు విజయాలు అందిస్తాడు. శ్రీహరితో పాటు ఈ మాసం సూర్యదేవుడికి మహా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దానాలు చేస్తే మోక్షం పొందుతారని విశ్వసిస్తారు. సంపంగి పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే కుజ దోషం తొలగిపోతుందని ఆర్థిక సమస్యలు సమసిపోతాయని నమ్ముతారు.
గోదాదేవి కథ
మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ నెలలోనే గోదాదేవి ధనుర్మాస వ్రతం చేపట్టి నారాయణుడిని కొలిచింది. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని చెప్పి దీక్ష చేపడుతుంది. ధనుర్మాసంలో వేకువ జామున నిద్రలేచి విష్ణువుని పూజించింది. తనకి కలిగిన అనుభవాలని, కోరికలని, భావాన్ని పద్యం రూపంలో రచించింది. వీటినే పాశురం అంటారు. అలా 30 పాశురాలు రచించి విష్ణువుకి అంకితం చేసింది. ఈ పాశురాలని తిరుప్పావై అంటారు. తిరుప్పావై అంటే పవిత్ర వ్రతం అని అర్థం.
గోదాదేవి భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఆమెని తన తండ్రిని తీసుకుని శ్రీ రంగం చేరుకుంటుంది. అక్కడ రంగనాథ స్వామితో వివాహం జరుగుతుంది. అప్పుడే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకారిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. అందుకే ధనుర్మాసంలో వ్రతం ఆచరిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మ దేవుడు నారద మహర్షితో చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ధనుర్మాస వ్రత ఫలితాలు
ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారని నమ్మకం. ధనుర్మాసంలో తిరుప్పావై పాడుతూ విష్ణువుని ఆరాధించడం వల్ల కన్నెపిల్లలకి మంచి భర్త లభిస్తాడు. పాశురాలు పఠిస్తూ వ్రతం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఈ మాసం మొత్తం పూజలు, వ్రతాలు, దైవ భక్తితో నిండి ఉంటుంది. కార్తీక మాసంలో పుణ్య స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ధనుర్మాస స్నానాలకి ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది. దీన్నే వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి అని కూడ పిలుస్తారు.