Dhanurmasam: ధనుర్మాసం అంటే ఏంటి? ఈ మాసంలో ఆచరించాల్సిన నియమాలేంటి?-importance and significance of month of dhanurmasam for worship lord vishnu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dhanurmasam: ధనుర్మాసం అంటే ఏంటి? ఈ మాసంలో ఆచరించాల్సిన నియమాలేంటి?

Dhanurmasam: ధనుర్మాసం అంటే ఏంటి? ఈ మాసంలో ఆచరించాల్సిన నియమాలేంటి?

Himabindu Ponnaganti HT Telugu
Jan 11, 2022 11:38 AM IST

ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. ఈ రాశిలో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ధనుస్సు రాశిని కొన్ని ప్రాంతాలలో అరిష్టంగా పరిగణిస్తారు. కొన్ని చోట్ల ఈ మాసాన్ని శూన్య మాసంగా కూడా భావిస్తారు. ఈ మాసంలో వివాహాలు, ఇతర శుభకార్యక్రమాలు చేయరు.

ధనుర్మాసం విష్ణువుకు ప్రీతికరం
ధనుర్మాసం విష్ణువుకు ప్రీతికరం

హిందూ మతంలో ప్రతి నెలకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా విష్ణువుకు (lord Vishnu) ధనుర్మాసం చాలా ప్రత్యేకం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసీదళాలతో పూజించడం పుణ్యప్రదమని పండితులు చెబుతారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తారు.

తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ఈ నెల విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజిస్తారు. మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత పదిహేను రోజులు దద్యోజనాన్ని నైవేద్యంగా పెడతారు.

ధనుర్మాస వ్రతం

ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, కృష్ణుని లేదా శ్రీ రంగనాథులను అర్చిస్తారు. తిరుప్పావై పాశురాలను రోజుకొక్కటి గానం చేయాలి. ఈ మాసంలో ఒంటి పూట భోజనం ఆచరించాలి. బ్రహ్మచర్యం ఉత్తమం. భగవంతుని నామాన్ని కీర్తిస్తూ, పలు రకాల పువ్వులతో స్వామిని పూజించింది గోదాదేవి. శ్రీ రంగనాథులు, గోదాదేవి కల్యాణం చేయాలి. మనస్సు, మాట, శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ధనుర్మాస వ్రతం, మార్గశీర్ష వ్రతం, సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారట. ఈ మాసంలో స్వామి వారికి పొంగలి నైవేద్యంగా పెట్టాలి.

వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై

మార్గశిర పౌర్ణమి తర్వాత పాఢ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. వైష్ణవ, సూర్యాలయాలను కూడా సందర్శించడం కూడా శుభప్రదం. 

ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు.

వివాహం కాని వారికి కల్యాణం..

ధనుర్మాసంలో రోజూ శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి.

ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి "ముక్కోటి ఏకాదశి" వస్తుంది. ఆరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి వారికి ఆ రోజు తులసి మాలను సమర్పిస్తారు. ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్ర సమయాలలో స్త్రీలు తులసికోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్