Sri Govinda Raja swamy temple: తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయం విశిష్టత ఏమిటి?-what is special about sri govinda raja swamy temple in tirupati ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sri Govinda Raja Swamy Temple: తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయం విశిష్టత ఏమిటి?

Sri Govinda Raja swamy temple: తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయం విశిష్టత ఏమిటి?

HT Telugu Desk HT Telugu
May 17, 2024 09:56 AM IST

Sri Govinda Raja swamy temple: తిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం విశిష్టత ఏంటి? ఈ ఆలయ ప్రత్యేకతలు, పూజల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం గోవిందరాజస్వామి సింహ వాహనంపై అభయమిచ్చారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం గోవిందరాజస్వామి సింహ వాహనంపై అభయమిచ్చారు.

శ్రీమన్‌ నారాయణుని అవతారాలలో, శ్రీ మహావిష్ణువు స్వరూపాలలో శ్రీ గోవిందరాజస్వామివారి స్వరూపము చాలా విశేషమైనదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గోవిందరాజస్వామి అలయములో అదిశేషునిపై శయనించి ఉన్నట్లుగా ఆయన దర్శనమిస్తారని చిలకమర్తి తెలిపారు. దక్షిణ దిక్కున శిరస్సు, ఉత్తరదిక్కున పాదాలు ఉండి శంఖచక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై నాభికమలం నుండి బ్రహ్మ బయటకు రాగా శిరస్సున కిరీటి ధారియై స్వామి ఉండగా, ఆదిశేషుడు ఛత్రంవలే ఉండి నీడనిస్తూ ఉండగా శ్రీ భూదేవేరులు పాదసేవ చేస్తున్నట్లుగా ఉంటారు. మధుకైటభులు తమ రాక్షస భావం నుండి విముక్తులై స్వామిని ప్రార్థిస్తున్నట్లు ఉంటారని చిలకమర్తి తెలిపారు.

శ్రీ రామానుజులు చిదంబరంలో శ్రీమహావిష్ణువునకు ఏవిధంగా పూజలు జరిగేవో తిరుపతిలోశ్రీ గోవిందరాజస్వామి వారికి కూడా అదే సంప్రదాయంతో అర్చనాదులు జరిగే విధంగా కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. ఫాల్గుణమాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో శ్రీగోవిందరాజస్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగినట్లు ఐతిహ్యం. వీర నరసింహ రాయలరాణి శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయంలో అఖండ దీపం వెలిగించేందుకు 32 గోవులను సమర్పిస్తూ ఒక దానశాసనం వేశారు.

1239 సంవత్సరంలో ఈ రాయలరాణి పైడిపల్లి గ్రామాన్ని ఆలయాలకు సమర్పిస్తూ ఆ గ్రామ ఆదాయం సగభాగం రాబడిని తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధికి, మిగిలిన సగభాగం గోవిందరాజస్వామివారికి సర్వమాన్యం క్రింద సమర్పించినట్లు శాసనం. 1219వ సంవత్సరంలోనే లోపలి గోపురం నిర్మాణం జరిగింది అని చిలకమర్తి తెలిపారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని జయ విజయ ద్వారపాలకుల ప్రతిష్ట 1549 సంవత్సరంలో నంద్యాల నారాయణప్ప గావించాడు. వేదాంత దేశికుల సన్నిధికి సమీపంలో గల నాలుగు కాళ్ల మంటపం 1494లో నిర్మించారు. జయ విజయులకు ముందున్న మంటపమే చిత్రకూట మంటపం, దాన్ని 1493లో నిర్మించారు. ఈ ఆలయంలోనే తిరుమంగై ఆళ్వార్‌ సన్నిధి 1234వ సంవత్సరంలో, గోదాదేవి సన్నిధి 1254వ సంవత్సరంలో నిర్మించారు.

1495వ సంవత్సరం నుండి గోదాదేవికి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగే విధంగా కట్టడి ఏర్పడింది. ఈ ఆలయంలోనే శ్రీ నమ్మాళ్వార్‌, కులశేఖరాళ్వార్‌, పెరియాళ్వార్‌, మధురకవి ఆళ్వార్‌, శ్రీరామామానుజసన్నిధి, కూరత్తాళ్వాన్‌ సన్నిధి సాలై నాచ్చియార్‌ అనే పుండరీకవల్లీ తాయారు సన్నిధి ఉన్నాయి.

ఎత్తైన గాలి గోపురం - తూర్పుముఖంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ముందు ఎత్తైన రాజగోపురం చక్కని శిల్ప సౌందర్యంతో నిర్మితమైంది. ఇది తిరుపతి నగరానికే ఒక శోభాయమానం. దీన్ని మట్ల అనంతరాజు నిర్మించినట్లు తెలుస్తోంది. గోపురం ఎత్తు సుమారు 100 అడుగులు ఉండవచ్చు. ఈ గోపురంపై 11 కలశాలు బంగారుతాపడంతో ప్రతిష్టింపబడ్డాయి. భక్తులు ఈ గోపురం ద్వారా ప్రవేశించే ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.

భక్త ఆంజనేయస్వామి ఆలయం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం సన్నిధి వీధి ఆరంభంలో అభిముఖంగా శ్రీ భక్త ఆంజనేయస్వామివారు శ్రీ గోవిందరాజస్వామికి నమస్కరిస్తున్నట్లుగా ఏడడుగుల ఎత్తున విగ్రహం ఉంది. ఈ ఆంజనేయస్వామి వారి అలయంలో మహామండపం, ముఖమండపం, గర్భగృహం, వేసరరూపంలో విమాన నిర్మాణం చేయబడింది. ఈ ఆంజనేయస్వామికి ప్రతి రోజు ఆరాధనలు, నివేదనలు శ్రీ గోవిందరాజస్వామివారి అర్చన అనంతరం వైభానసశాస్రరీత్యా జరుపబడతాయి.

ఆలయవర్ణన

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం విశాల ప్రాంగణంలో ఉంది. 11 కలశాలతో ప్రతిష్టించబడిన మొదటి గోపురం దాటి రెండవగోపురం వద్దకు రాగానే ఒక చిన్న కోనేరు ఉంది. దీన్నే బుగ్గ అంటారు. ఈ బుగ్గమీద శ్రీ గోవిందరాజ స్వామివారికి బుగ్గోత్సవాలు జరుగుతాయి. అగ్నేయ భాగంలో లక్ష్మీమండపం ఉంది. ఇక్కడే పూర్వం ఊరేగింపు జరుపబడేది. ఆ తరువాత తొమ్మిది కలశాలతో అలరారుతున్న రెండవగోపురం దాటి లోపలకు ప్రవేశించగానే ఉత్తరాభిముఖంగా పుండరీకవల్లీ తాయారు దర్శనమిస్తారు.

ఆమె గోవిందరాజస్వామివారి పట్టపురాణి. ఈమెనే శాలినాచ్చియార్‌ అని కూడా అంటారు. ఆలయముఖ మండపముపై అష్టలక్ష్ములు దర్శనమిస్తారు. ఏడు కలశాలతో అతి సుందరంగా నిర్మింపబడ్డ మూడవ రాజగోపురం దాటి లోపలికి ప్రవేశించగానే ఆలయానికి అగ్నేయభాగంలో ఆరోహణమంటపం, ఈశాన్యభాగంలో అవరోహణమంటపం దర్శనమిస్తాయి. ఉత్తరభాగంలో శ్రీ గోవిందరాజస్వామివారు జయ విజయద్వారపాలక సంరక్షకులుగా గరుత్మంతుడు అభిముఖంగా ఉండి దర్శనమిస్తారు.

అటు బయట బంగారుతాపడంతో ధ్వజ స్తంభ బలిపీఠాలు ఉండగా, స్వామి గర్భాలయంలో శ్రీభూదేవేరులు పాదసేవ చేస్తుండగా నాభికమలంలో బ్రహ్మ, అలాగే పాదాలకు కాస్త అవతల మధుకైటభులు స్వామిని సేవిస్తూండగా తిరుమలలో వలే రథసప్తమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. సంవత్సరకాలంలో సుమారుగా 300 రోజుల పాటు అనేక ఉత్సవాలు గోవిందరాజస్వామివారి అలయంలో వైభవంగా జరుగుతాయి అని చిలకమర్తి తెలిపారు.

ఊంజల సేవ

స్వామివారి ఆలయ ప్రాంగణంలో వెనుకభాగంలో ఉన్న అద్దాలమండపంలో ప్రతినిత్యం సాయంత్రం 5.30 నుండి 6.00 గంటల మధ్య ఊంజలసేవ జరుపబడుతుంది.

ఆలయంలో నిత్య పూజలు

ప్రతిరోజూ సుప్రభాత సేవ ఉ. 5.00 గం॥లకు, సర్వదర్శనం ఉ. 5.30 గం॥లకు, తోమాల సేవ ఉ. 6.30 గం॥లకు, సహస్ర నామార్చన ఉ. 7.00 గం॥లకు, మొదట గంట నివేదన శాత్తుమొర ఉ. 9.00 గం॥లకు, మధ్యాహ్న కాలార్చన, నివేదన మ. 12.30 గంటలకు, సాయం ఆరాధన, తోమాల, నివేదన సా. 5.00 గం॥లకు, ఏకాంతసేవ రా. 9.00 గం॥లకు జరుపబడతాయి.

నైమిత్తిక పూజలు

ఉత్తరా నక్షత్రం రోజు శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు, ఏకాదశి తిథిన పరివార దేవతలకు, రోహిణీ నక్షత్రం రోజు పార్థసారథి స్వామికి, శుక్రవారం రోజు ఆండాళ్‌ అమ్మవారికి, శ్రవణా నక్షత్రం రోజు కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి, శుక్ర వారం పుండరీకవల్లీ అమ్మవారికి, ఎదురు అంజనేయ స్వామివారికి ఆదివారం, గరుడాళ్వారుకు సోమవారం, మఠం ఆంజనేయస్వామివారికి శనివారం, అభయ ఆంజనేయస్వామివారికి మంగళవారం అభిషేకాలు జరుగుతాయి.

సంవత్సరానికి నాలుగు రోజులు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుపబడుతుంది. ఫాల్గుణ పూర్ణిమ రోజున శ్రీగోవింద రాజస్వామివారికి వైభవంగా పూలంగిసేవ జరుగుతుంది. పుష్కరిణి ఆ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయానికి బయట కొద్ది దూరంగా ఈశాన్యంలో పుష్కరిణి నిర్మితమైంది. మధ్యలో నీరాళి మంటపం కూడా అత్యంత ప్రాచీన పద్ధతిలో నిర్మింపబడింది. ఈ పుష్కరిణిలో మాఘ పూర్ణిమకు పూర్తయ్యే విధంగా ఏడురోజుల పాటు శ్రీ దండరామస్వామికి, శ్రీపార్ధసారథిస్వామికి, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామికి, శ్రీ గోదాకృష్ణులకు, శ్రీ గోవిందరాజస్వామికి తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఈ పుష్మరిణీతీరంలో ప్రతిరోజూ సాయంత్రం తి.తి.దే. హిందూ ధర్మప్రచారపరిషత్‌ ద్వారా హరికథ, సంగీతకచేరి, ఉపన్యాస కార్యక్రమాలు జరుపబడతాయి. భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel