Gopuram । ఆలయ గోపురం విశిష్టత ఇదే.. ఎత్తైన గోపురాలు కలిగిన దేవాలయాలు ఇవే!
Gopuram: ఆలయాలకు గోపురాలు ఎందుకు నిర్మిస్తారు. ఎత్తైన గోపురాలు కలిగిన ఆలయాలు ఏవి. ఆలయ గోపురం విశిష్టత తదిదర విషయాలు తెలుసుకోండి.
భారతదేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి, ఇవి నాటి వైభవానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. దేవాలయాలను చూసినపుడు ప్రధానంగా ఆకర్షించేది దాని గోపురం. ఆప్పట్లోనే ఎంతో ఎత్తుతో, మరెంతో శాస్త్ర విజ్ఞానంతో నిర్మించిన గోపురాలు అబ్బురపరుస్తాయి. ఆనాటి నిర్మాణశైలిని, శతబ్దాలు గడిచినా నేటికి చెక్కుచెదరకుండా ఉండే వాటి దృఢత్వం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. సాధారణంగా గుడికంటే ఎక్కువ ఎత్తులో గోపురం ఉంటుంది. మరి ఈ గోపురాలను ఎందుకు నిర్మిస్తారు? గోపురం విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయాలకు గోపురాలు నిర్మించడం అనేది పల్లవులు, చోళ వంశీయుల నుంచి మొదలైందని చరిత్ర కథనాల ద్వారా తెలుస్తోంది. పన్నెండవ శతాబ్దం నాటికి పాండ్యులు ఈ గోపురాలను దేవాలయాలకు ముఖద్వారంగా నిర్మించినట్లు చెబుతారు. ఈ గోపురాలు ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. ఒక ఆలయ గోపురం అంతస్థుల మాదిరిగా కింద పెద్ద ద్వారంగా మొదలై, పైకి వెళ్తున్నకొద్ది వెడల్పు తగ్గుకుంటూ పోతుంది. చివరి అంచున కలశం అనేది ఏర్పాటు చేస్తారు.
Gopuram Significance - గోపురం విశిష్టత
గోపురం అనేది ప్రధానంగా ఆలయ సన్నిధికి ముఖద్వారం. బాటసారులు వెళ్లేటపుడు దూరం నుంచి కూడా కనిపించేలా ఆలయ గోపురం, దాని ధ్వజస్థంభం నిర్మించేవారు. పురాతన కాలంలో, ఎత్తైన గోపురాలు ప్రయాణికులకు ల్యాండ్‌మార్క్‌లుగా ఉపయోగపడేవి. ఇవి దిక్కులను కూడా సూచించేవి. ఆలయగోపురం నాలుగు దిశలలో నిర్మిస్తే, మధ్యలో గర్భగుడికి ఎదురుగా ఆలయ ధ్వజస్థభం ప్రతిష్ఠాపన చేసేవారు.
ఈ గోపురాలకు శాస్త్రీయ ప్రయోజనం కూడా ఉంది. ఇవి ఎత్తుగా ఉండటం వలన మెరుపు వాహకాలుగా పనిచేసేవి. ఆలయం చుట్టుపక్కల ఎలాంటి పిడుగుపాట్లు జరగకుండా మెరుపులను ఈ గోపురాలు స్వీకరిస్తాయి. గర్భ గుడిలో ఉండే దేవతామూర్తి వద్దకు శక్తి ప్రసారం చేయడం జరిగి, అక్కడ శక్తి నిక్షిప్తం అవుతుందని విశ్వసిస్తారు. అందుకే మందిరం చుట్టూ సవ్యదిశలో చేసే ప్రదక్షిణల వలన మానవ శరీరాలకు సానుకూల శక్తి లభిస్తుందని చెప్పడం జరుగుతుంది.
Temples With The Tallest Gopurams- ఎత్తైన గోపురాలు కలిగిన దేవాలయాలు
నాటి కాలం నాటి దేవాలయాలన్నీ ఎత్తైన గోపురాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే ఇంటి నిర్మాణాలు ఉండగా, ఒక్క తమిళనాడులోనే అత్యధికంగా ఉండటం విశేషం. ఎత్తైన గోపురాలు కలిగి ఉన్న ఆలయాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
1. శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తమిళనాడు
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 239 అడుగులు.
2. మురుడేశ్వర్ దేవాలయం, కర్ణాటక
మురుడేశ్వర్ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. శివుడు కొలువై ఉన్న ఈ ఆలయ రాజగోపురం 237 అడుగుల ఎత్తు ఉంది.
3. అరుణాచలేశ్వర ఆలయం, తమిళనాడు
పంజాభూత తాళాలలో అగ్నికి కేంద్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 216.5 అడుగులు.
4. శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం, తమిళనాడు
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం. ఈ ఆలయ రాజగోపురం 192 అడుగుల ఎత్తు ఉంది.
5. కంచి పెరుమాళ్ ఆలయం, తమిళనాడు
ఉలగలంద పెరుమాళ్ ఆలయం, తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉంది. ఈ ఆలయ రాజగోపురం 192 అడుగుల ఎత్తు ఉంది.
6. ఏకాంబరేశ్వర ఆలయం, తమిళనాడు
తమిళనాడు, కాంచీపురం జిల్లాలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. దీని రాజగోపురం 190 అడుగుల ఎత్తు ఉంటుంది.
7. మీనాక్షి అమ్మన్ టెంపుల్, తమిళనాడు
మీనాక్షి సుందరేశ్వర ఆలయం, తమిళనాడులోని మధురై జిల్లాలో ఉంది. దీని ఎత్తు 14 టవర్లతో 170 అడుగులు.
8. విరూపాక్ష దేవాలయం, కర్ణాటక
విరూపాక్ష దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయ రాజగోపురం 166 అడుగుల ఎత్తు ఉంది.
9. సారంగపాణి ఆలయం, తమిళనాడు
తమిళనాడులోని కుంభకోణం దేవాలయ పట్టణంగా ప్రసిద్ధి. ఇక్కడ సారంగపాణి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం 164 అడుగుల ఎత్తు ఉంది.
10. రాజగోపాల స్వామి ఆలయం, తమిళనాడు
తమిళనాడులోని మన్నార్గుడిలో రాజగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం 154 అడుగుల ఎత్తు ఉంది.
సంబంధిత కథనం