తెలుగు న్యూస్ / ఫోటో /
Veta Venkateswara Swamy Temple : అక్కడ వెంకటేశ్వర స్వామికి మాంసమే నైవేద్యం! ఆ దేవాలయం ఎక్కడో తెలుసా?
- Veta Venkateswara Swamy Temple : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేట వెంకటేశ్వర స్వామికి భక్తులు నిత్యం వేట పోతులను బలి ఇచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.
- Veta Venkateswara Swamy Temple : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేట వెంకటేశ్వర స్వామికి భక్తులు నిత్యం వేట పోతులను బలి ఇచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.
(1 / 6)
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అక్కడ మాంసాన్ని నైవేద్యంగా(Meat Naivedyam) సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చమని ముడుపులు కట్టి మేక పోతుని బలి ఇస్తారు. వెంకటేశ్వర స్వామికి మేకను బలి ఇవ్వడం ఏంటని ఆశ్చర్యం కలుగుతోంది కదూ. ఇది నూటికి నూరుపాళ్ల నిజం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేట వెంకటేశ్వర స్వామికి (Veta Venkateswara Swamy Temple)భక్తులు నిత్యం వేట పోతులను బలి ఇచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.
(2 / 6)
వినడానికి వింతగా అనిపించినా ఈ ఆచారం కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. మర్రిగూడెంలో కొలువై ఉన్న వేట వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం ఏంటంటే 500 సంవత్సరాల కిందట వేట మార్గంలో ఈ ప్రాంతానికి వచ్చిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అక్కడ వెంగళప్ప అనే ఒక భక్తునికి దర్శనమిచ్చాడట. ఆ సమయంలో పులకించిపోయిన ఆ భక్తుడు స్వామిని అక్కడే ఉండి పోవాలని కోరిక కోరాడట. దీంతో ఆ భక్తుడి కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి అక్కడ శిలా రూపంలో వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి.
(3 / 6)
ఈ దేవాలయం సమీపంలో అశ్వవాహన రూపాన్ని వదిలి వెంకటేశ్వర స్వామి గోరూపాన్ని ధరించిన ప్రదేశంలో గోపాద ముద్రలు దర్శనమిస్తాయి. అక్కడికి వచ్చే భక్తులు ముందు గోపాదాన్ని దర్శించుకున్న తర్వాతే వేట వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళతారు. ఇది అక్కడి ఆనవాయితీ. సంతానలేమితో బాధపడే భార్యాభర్తలు, కళ్యాణం కోసం ఎదురుచూసే యువతీ యువకులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే ఉద్యోగార్థులు, ఇంట్లో అనేక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు ఈ వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి తమ కోరికలను తీర్చాలని, తమ కష్టాలను గట్టెక్కించాలని మొక్కుకుంటారు.
(4 / 6)
ఇలా కోరుకున్న భక్తులు తమ కోరికలు తీరిన వెంటనే స్వామి వారిని దర్శించుకుని మేక పోతును బలి ఇచ్చి మాంసాన్ని నైవేద్యంగా వండి పెడతారు. ఈ దేవాలయ ప్రాంగణంలోని లిఖిత ప్రతి ఆధారంగా శాలివాహన శకం 1525 శ్రీముఖ నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ విదియ శుభ దినాన స్వామి వారు ఇక్కడ అవతరించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు కొలువై ఉన్న ఈ దేవాలయంలో ఆళ్వారుల విగ్రహాలు కనిపించడం విశేషం. ప్రతియేటా ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున వేట వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవ, తెప్పోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరుపుతారు.
(5 / 6)
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ స్వామి వారిని వేట వెంకటేశ్వర స్వామిగా, బాలాజీ నామదేవుడిగా భక్తులు పిలుచుకుంటారు. వెంకటేశ్వర స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం భారత దేశం అంతటా ఎక్కడ వెతికినా దొరకదు. ఈ వింత ఆచారం మర్రిగూడెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.(రిపోర్టింగ్ : కాపర్తి నరేంద్ర, ఖమ్మం)
ఇతర గ్యాలరీలు