తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ప్రాముఖ్యత, శుభ ముహూర్తం, పూజా సామాగ్రి, పూజా విధానం తెలుసుకోండి

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ ప్రాముఖ్యత, శుభ ముహూర్తం, పూజా సామాగ్రి, పూజా విధానం తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu

09 May 2024, 16:53 IST

google News
    • Akshaya tritiya 2024: అక్షయ తృతీయ ప్రాముఖ్యత, శుభ ముహూర్తం, పూజకు కావాల్సిన సామాగ్రి, పూజా విధానం మొదలైన వివరాల గురించి ఇక్కడ తెలుసుకోండి. 
అక్షయ తృతీయ శుభ ముహూర్తం, పూజా విధానం
అక్షయ తృతీయ శుభ ముహూర్తం, పూజా విధానం (freepik )

అక్షయ తృతీయ శుభ ముహూర్తం, పూజా విధానం

Akshaya tritiya 2024: మే 10 వ తేదీ అక్షయ తృతీయ వచ్చింది. శుక్రవారం పూట అక్షయ తృతీయ రావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈరోజు ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా దాని ఫలితం అక్షయం.

అక్షయ తృతీయ రోజు దానం కూడా అనేక రెట్లు ఫలితం లభిస్తుంది. ఏం కొనుగోలు చేసిన అది అనంతంగా మారుతుంది. స్కంద పురాణం ప్రకారం అక్షయ అంటే ఎప్పటికీ క్షీణించనది అని అర్థం. ఈ ఏడాది అక్షయ తృతీయ అనేక శుభ యోగాలతో వచ్చింది. దీని వల్ల ఈరోజు ప్రాముఖ్యత రెట్టింపు అయ్యింది.

ఐదు శుభ యోగాలు

వైశాఖ శుక్లపక్ష తదియ అక్షయ తృతీయ రోజు రోహిణి నక్షత్రం కూడా ఉండటం అరుదైన యాదృచ్ఛికంగా పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది అక్షయ తృతీయ రోజు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. గజకేసరి యోగం, ధన యోగం, రవి యోగం, సుకర్మ యోగం, శశ రాజయోగం ఉన్నాయి.

ఈ శుభ యోగాల ఫలితంగా అక్షయ తృతీయ మేషం, వృషభం, మీనరాశి వారికి ఎంతో శుభదాయకం. శని తన సొంత రాశిలో ఉండటం వల్ల శశ రాజ యోగం ఏర్పడుతుంది. వృషభ రాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. సుమారు వందేళ్ల తర్వాత అక్షయ తృతీయ గజకేసరి యోగంతో జరుపుకుంటున్నారు.

శుభ ముహూర్తం

అక్షయ తృతీయ శుభ ముహూర్తం ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 12.13 గంటల వరకు ఉంటుంది.

వ్యవధి 6.14 గంటలు

తృతీయ తిథి ప్రారంభం మే 10 ఉదయం 4:17 గంటల నుంచి

తృతీయ తిథి ముగింపు మే 11 తెల్లవారుజాము 2.50 వరకు ఉంటుంది.

పూజా సామాగ్రి

ఎరుపు లేదా పసుపు వస్త్రం

లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వినాయకుడు, కుబేరుడి విగ్రహాలు లేదా చిత్రపటాలు

గంగా జలం

గంధం పేస్ట్

కుంకుమ

తాజా పువ్వులు

బియ్యం

ధాన్యాలు

బిల్వపత్రాలు

దుర్వా గడ్డి

కొబ్బరికాయలు

పండ్లు

స్వీట్లు

ధూపం

కర్పూరం

కుబేర చాలీసా, కనకధారా స్తోత్రం, విష్ణు సహస్రనామం, గణేష్ చాలీసా పుస్తకాలు, పూజా పాత్రలు

పూజా విధానం

అక్షయ తృతీయ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. లేదంటే గంగా జలం నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇంట్లో ఉన్న పూజ గదిని శుభ్రం చేసుకోవాలి.

ఒక పీఠపరిచి దానిమీద ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరచాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వినాయకుడు అలాగే కుబేరుడితో కూడిన చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉంచాలి. గంగాజలంతో వాటిని శుద్ధిచేసి చందనం రాయాలి. ధూప దీపాలు నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం లేదా విష్ణు చాలీసా పఠించాలి.

తామర పూలతో చేసిన దండ లక్ష్మీదేవికి సమర్పించి గులాబీ పరిమళాలు వెదజల్లే సెంటు అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. తప్పనిసరిగా ఈరోజు కనకధారా స్తోత్రం పఠిస్తే శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి.

బంగారం కొనుగోలుకు మంచి సమయం

మే 10 మధ్యాహ్నం 12.07 గంటల నుంచి మధ్యాహ్నం 1.47 గంటల వరకు మంచి సమయం. మళ్ళీ సాయంత్రం 4.58 గంటల నుంచి 6:49 గంటలవరకు

దానం ముఖ్యం

గ్రహాల కలయిక దృష్ట్యా అక్షయ తృతీయ రోజు నిండుకుండలో నీటిని దానం చేయాలి. తెల్లని బట్టలు, స్వీట్లు, ఉప్పు, షర్బత్, మజ్జిగ, బియ్యం, వెండి దానం చేయడం ఎంతో శుభదాయకం. ధార్మిక పుస్తకాలు, గ్రంథాలు, పండ్లు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.

అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం విష్ణువు పరశురాముడు అవతారం ఎత్తింది ఈరోజే. అలాగే కుబేరుడికి శివుడు, బ్రహ్మ కలసి సంపద బాధ్యతలు అందించింది కూడా ఈ రోజే. అక్షయ తృతీయ రోజు చాలామంది పరశురామ జయంతిని కూడా జరుపుకుంటారు. అలాగే గంగానది భూమిపైకి దిగి వచ్చింది కూడా అక్షయ తృతీయ రోజే. ఈరోజు చేసే దానాలకు అనంతమైన ఫలితం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

తదుపరి వ్యాసం