బెంగళూరు గుహలో నుంచి బయటకు వచ్చిన 188ఏళ్ల వృద్ధుడు! ఈ వార్తలో నిజమెంత?
05 October 2024, 12:27 IST
Siyaram Baba age : ఓ వృద్ధుడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన వృద్ధుడి వయస్సు 188ఏళ్లు అని ఉంది. దీనిని ఫ్యాక్ చెక్ చేయగా.. అది తప్పని తేలింది.
ఈ వృద్ధుడి వయస్సు నిజంగానే 188ఏళ్లా?
బెంగళూరులోని ఓ గుహ నుంచి బయటకు వచ్చిన ఓ వృద్ధుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా సన్నగా, ఒంగిపోయి నడుస్తున్న ఆ వృద్ధుడి వయస్సు 188 అని ఆ వీడియోలో ఉంది. ఇందులో నిజమెంత? ఇక్కడ తెలుసుకోండి..
వృద్ధుడి వయస్సు ఎంత?
‘కన్సర్నడ్ సిటిజెన్’ అన్న పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి ఈ వీడియో వచ్చింది.
"ఈ భారతీయుడు ఇప్పుడే ఒక గుహలో దొరికాడు. ఆయన వయస్సు 188 సంవత్సరాలు,' అని పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 34 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
అయితే సోషల్ మీడియా యూజర్లు, ఫ్యాక్ట్ చెకర్లు, మీడియా రిపోర్టులు అసలు విషయాన్ని బయటపెట్టారు!
ఆ వృద్ధుడు మధ్యప్రదేశ్‌కు చెందిన సియారామ్ బాబా అని పిలిచే గౌరవనీయ హిందూ సాధువు అని తేలింది. ఆయన అసలు వయస్సు సుమారు 110 సంవత్సరాలు ఉంటుందని స్పష్టమైంది. ఈ వయస్సు పెద్దదే అయినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన క్లిప్‌లో చెప్పినట్టు 188 కాదు!
ఇదీ చూడండి:- Jaishankar : పాకిస్థాన్ పర్యటనకు జైశంకర్- దాశాబ్ద కాలంలో తొలిసారి ఇలా.. ఎందుకంటే!
ఈ వీడియోకు ఆదరణ పెరగడంతో ప్లాట్‌ఫామ్ ఎక్స్ డిస్క్లైమర్ని కూడా ఇచ్చింది.
"తప్పుడు సమాచారం! ఆ వృద్ధుడు భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో నివసించే 'సియారామ్ బాబా' అనే హిందూ సాధువు. నివేదికల ప్రకారం ఆయన వయస్సు 110 సంవత్సరాలు," అని ఎక్స్ డిస్‌క్లైమర్‌లో పేర్కొంది.
నర్మదా నది ఒడ్డున ఉన్న భత్యాన్ ఆశ్రమంలో నివసిస్తున్న సియారామ్ బాబా తన పురాణ గాథలకు ప్రసిద్ధి చెందారని, ఒక దశాబ్దం పాటు తపస్సులో ఒక కాలుపై నిలబడి గడిపారని నవభారత్ టైమ్స్ తాజా కథనంలో పేర్కొంది. 109 ఏళ్ల వయస్సులో కూడా కళ్లద్దాలు లేకుండా రామాయణం చదవగలుగుతున్నారని పేర్కొంది. చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి అని, ఆయన ఆశీస్సులు పొందడానికి భక్తులు పోటెత్తుతారని నివేదిక వెల్లడించింది.
ఇదీ చూడండి:- Veg thali prices : జేబుకు చిల్లు- కడుపు మాత్రం నిండదు! విపరీతంగా పెరిగిన వెజ్ థాలీ ధరలు..
అయితే స్థానిక పురాణాల ప్రకారం సాధువు వయస్సు 130 సంవత్సరాల వరకు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
'నేను 188 కూడా రాసినందుకు సిగ్గుగా ఉంది. 120కి మించితే అది హాస్యాస్పదమని చెప్పాలి," అని వీడియోని తొలుత పోస్ట్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు.
ఈ పోస్టుకు కొన్ని సరదా రిప్లైలు కూడా వచ్చాయి.
"బహుశా ఆయన్ని అక్కడే వదిలేసి ఉండాల్సింది. గుహలు ఆయనకి వర్కవుట్ అవుతున్నట్లు అనిపిస్తోంది,' అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
“అమెరికాలో డెమొక్రాట్లు ఆ వ్యక్తిని తదుపరి అధ్యక్ష పదవికి నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు,” అని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ వయస్సపై జరిగిన చర్చను గుర్తు చేస్తూ మరొకరు సెటైర్ వేశాడు.
మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి? వృద్ధుడి వయస్సు ఎంత ఉంటుందని భావిస్తున్నారు?