Viral News : ఆసుపత్రికి వచ్చి లిఫ్ట్‌లో చిక్కుకున్న రోగి.. 2 రోజులు అందులోనే.. వచ్చి తెరిచి చూస్తే
15 July 2024, 15:53 IST
- Patient Stuck : ఓ వ్యక్తి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చాడు. అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. శని, ఆదివారాలు అందులోనే ఉన్నాడు.
ప్రతీకాత్మక చిత్రం
కేరళ రాజధాని తిరువనంతపురంలో రెండు రోజులుగా ఆసుపత్రి లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన 59 ఏళ్ల వ్యక్తి సహాయం కోసం ఎంత గట్టిగా కేకలు వేసినా ఎవరూ వినలేదు. వారాంతం కావడంతో ఆస్పత్రిలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. దీంతో అతడు లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడన్న విషయం ఎవరికీ తెలియలేదు. అప్పుడేం జరిగింది?
ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లిన 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాలేదు. ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి శనివారం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఎన్నిసార్లు అరిచినా అతని అరుపులు బయటి వారికి వినిపించలేదు. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో చాలా మంది సిబ్బంది సెలవులో ఉండడంతో ఆయన లిఫ్ట్‌లో ఇరుక్కున్న విషయం ఆస్పత్రికి కూడా తెలియలేదు. 2 రోజులుగా లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి ఎట్టకేలకు సోమవారం ఉదయం లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాడు. సోమవారం ఉదయం తమ రోజువారీ పనుల నిమిత్తం వచ్చిన సిబ్బంది లిఫ్ట్‌లో ఎవరో చిక్కుకున్నట్లు గుర్తించారు. అనంతరం లిఫ్ట్‌ను ఆపరేట్ చేసి అతడిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.
ఉల్లూరుకు చెందిన రవీంద్రన్ నాయర్ (59) శనివారం తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఓపీ బ్లాక్‌లోని లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. 'అతను మొదటి అంతస్తుకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కాడు. కానీ లిఫ్ట్ డౌన్ అయింది, మళ్లీ తెరుచుకోలేదు. దీంతో భయాందోళనకు గురైన అతను సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ రాలేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది.'అని పోలీసులు తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున లిఫ్ట్ ఆపరేటర్లు తమ పనులు ప్రారంభించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ వ్యక్తి ఆసుపత్రికి వచ్చినట్లు పోలీసులు చెప్పారు.
సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రికి చెందిన లిఫ్ట్ ఆపరేటర్ లిఫ్ట్ తెరిచి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు రవీంద్రన్. వెంటనే అతనికి వైద్య చికిత్స అందించారు. 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో స్పృహ కోల్పోయాడు.
వెన్నునొప్పికి చికిత్స చేయించుకునేందుకు రవీంద్రన్ శనివారం ఉదయం ఆర్థోపెడిక్ విభాగానికి వచ్చారు. డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్న తర్వాత కొన్ని మెడికల్ రికార్డులను తీసుకుని ఇంటికి వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం రవీంద్రన్ తిరిగి వచ్చి ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్లాడు. అయితే అకస్మాత్తుగా లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయింది. ఈ సంఘటన రవీంద్రన్ మొబైల్ ఫోన్ కూడా పాడైపోయింది. లోపల చిక్కుకున్నట్లు తెలియజేయడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు.
'అలారం బటన్‌ని నొక్కినా ఎవరూ రాలేదు. ఎమర్జెన్సీ ఫోన్‌ను కూడా లిఫ్ట్‌లో ప్రయత్నించాను, కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు.' అని బాధితుడు పేర్కొన్నాడు.