PM Modi Russia tour: పుతిన్ - మోదీ ల ఆలింగనంపై మండిపడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
09 July 2024, 16:48 IST
రష్యా పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను భారత ప్రధాని మోదీ ఆలింగనం చేసుకోవడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఒకవైపు, రష్యా దాడుల్లో అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తుంటే, మరోవైపు, అందుకు కారకుడైనవాడిని భారత ప్రధాని మోదీ కౌగిలించుకోవడం ఏంటని ప్రశ్నించారు.
మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మోదీ
PM Modi Russia tour: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్ ను ‘ప్రపంచంలోనే అత్యంత కరడుగట్టిన నేరస్తుడు’ అని జెలెన్స్కీ విమర్శంచారు.
ఒకవైపు రష్యా దాడులు, మరోవైపు ఆలింగనాలా?
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆత్మీయంగా కౌగిలించుకోవడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన వ్యక్తి చేయాల్సిన పని కాదని జెలెన్క్సీ వ్యాఖ్యానించారు. పుతిన్ ప్రపంచంలోనే అత్యంత కిరాతకుడైన నేరస్తుడు అని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.
శాంతి ప్రయత్నాలకు దెబ్బ
సోమవారం ఉక్రెయిన్ అంతటా రష్యా క్షిపణుల వర్షం కురిపించిందని, ఆ దాడుల్లో కనీసం 37 మంది పౌరులు మరణించారని, కీవ్ ప్రధాన పిల్లల ఆసుపత్రిని ధ్వంసం చేశారని జెలెన్స్కీ తెలిపారు. ‘రష్యా క్రూరమైన క్షిపణి దాడి ఫలితంగా ఉక్రెయిన్లో ఈ రోజు 37 మంది మరణించారు, వారిలో ముగ్గురు పిల్లలు, 13 మంది పిల్లలతో సహా 170 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ లోని అతిపెద్ద చిల్డ్రన్స్ హాస్పిటల్ పై రష్యా క్షిపణి దాడి చేసింది. పలువురు శిథిలాల కింద కూరుకుపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత ప్రపంచంలోనే అత్యంత రక్తసిక్త నేరస్థుడిని మాస్కోలో కౌగిలించుకోవడం శాంతి ప్రయత్నాలకు తీవ్రమైన, వినాశకరమైన దెబ్బ’ అని జెలెన్స్కీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
పుతిన్, మోదీ భేటీ
భారత్-రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పాల్గొనేందుకు ప్రధాని మోదీ (PM Modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు. సోమవారం ప్రారంభమైన రెండు రోజుల రష్యా పర్యటనలో ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్ తో సబర్బన్ మాస్కోలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత ప్రధాని మోదీ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.డానికి చర్చలు, దౌత్యం ద్వారానే రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడం, శాంతిని పునరుద్ధరించడం సాధ్యమని భారతదేశం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. గత దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ 16 సార్లు సమావేశమయ్యారు. చివరగా, 2022 లో ఉజ్బెకిస్థాన్ లోని సమర్ ఖండ్ లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) శిఖరాగ్ర సమావేశంలో వారు సమావేశమయ్యారు. 2019లో మోదీకి ప్రతిష్టాత్మక రష్యన్ ప్రభుత్వ పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది హోలీ అపోస్టల్ ఆండ్రూ ది ఫస్ట్'ను ప్రదానం చేశారు.