Rishi Sunak team: రుషి సునక్ టీమ్ లో వీళ్లే కీలకం
17 April 2024, 16:54 IST
- Rishi Sunak team: బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్ కూర్పుపై రుషి సునక్ దృష్టి పెట్టారు. ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్ ను కొనసాగించాలని నిర్ణయించారు.
బ్రిటన్ పీఎం అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ లో రుషి సునక్
Rishi Sunak team: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన బ్రిటన్ ను గాడిన పెట్టడం నూతన ప్రధాని రుషి సునక్ ముందున్ ప్రధాన బాధ్యత. అందులో భాగంగా ఆయన ముందుగా, సమర్ధవంతమైన కేబినెట్ మంత్రులను తన టీమ్ గా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగానే రుషి చర్యలు సాగుతున్నాయి.
Rishi Sunak team: ఆర్థిక మంత్రిగా మళ్లీ హంట్
ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్ ను జస్ట్ 11 రోజుల క్రితమే గత ప్రధాని లిజ్ ట్రస్ నియమించారు. కొద్దికాలమే ఫైనాన్స్ శాఖ ను చూసినప్పటికీ సమర్ధవంతమైన పనితీరుతో హంట్ ఆకట్టుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాతే మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. దాంతో, హంట్ ను ఆ కీలక బాధ్యతల్లో కొనసాగించాలని రుషి నిర్ణయించుకున్నారు.
Rishi Sunak team: డెప్యూటీ పీఎం..
డొమినిక్ రాబ్ ను తన డెప్యూటీగా, ఉప ప్రధానిగా రుషి సునక్ నియమించారు. డొమినిక్ కన్సర్వేటివ్ పార్టీలో కీలక నాయకుడు. ఉప ప్రధాని పదవితో పాటు న్యాయ శాఖను కూడా డొమినిక్ రాబ్ కు సునక్ అప్పగించారు. అలాగే, లిజ్ ట్రస్ మంత్రివర్గంలో హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించి, ఆ తరువాత రాజీనామా చేసిన స్యూల్లా బ్రేవర్మన్ కు రుషి సునక్ మళ్లీ అవే బాధ్యతలను అప్పగించారు. ట్రస్ మంత్రివర్గంలో రక్షణశాఖ ను చూసిన బెన్ వ్యాలెస్ కు మళ్లీ అదే శాఖను అప్పగించారు.
Rishi Sunak team: రాజీనామాలు కూడా..
రిషి సునక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పాత మంత్రులు కొందరు రాజీనామాలు చేశారు. వాణిజ్య శాఖ మంత్రి జాకోబ్ రీస్, న్యాయ శాఖ మంత్రి బ్రాండన్ లూయీస్, చీఫ్ విప్ వెండీ మోర్టన్, వర్క్ అండ్ పెన్షన్స్ మంత్రి స్మిత్.. తదితరులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.