తెలుగు న్యూస్  /  National International  /  Sabarimala All Set To Receive Pilgrims As Annual Season Begins From Today Know Arrangements Details Here

Sabarimala annual season begins: తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారం.. మండల యాత్ర ప్రారంభం

HT Telugu Desk HT Telugu

17 November 2022, 10:53 IST

    • Sabarimala annual season begins: మండల యాత్ర ప్రారంభానికి శ్రీకారం చుడుతూ శబరిమల ఆలయ ద్వారం తెరుచుకుంది. భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు తరలివస్తున్నారు.
భారీ వర్షంలోనూ క్యూలో నిలుచున్న అయ్యప్ప భక్తులు
భారీ వర్షంలోనూ క్యూలో నిలుచున్న అయ్యప్ప భక్తులు (PTI)

భారీ వర్షంలోనూ క్యూలో నిలుచున్న అయ్యప్ప భక్తులు

వార్షిక మండపం-మకరవిలక్కు యాత్ర సీజన్ ప్రారంభం కావడంతో శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆలయ గర్భగుడి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొత్త అర్చకుడు కందరరు రాజీవరు సమక్షంలో పదవీకాలం పూర్తిచేసుకున్న అర్చకుడు ఎన్.పరమేశ్వరన్ నంబూత్రి తెరిచారు.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

అయ్యప్ప స్వామి, మళికప్పూరం ఆలయాలకు కొత్తగా ఎంపికైన ప్రధాన అర్చకులు రానున్న ఏడాదికాలం పాటు పూజలు నిర్వహిస్తారు. 41 రోజుల మండల పూజ ఉత్సవాలు డిసెంబరు 27న ముగుస్తాయి.

జనవరి 14న జరిగే మకరవిళక్కు తీర్థయాత్ర నేపథ్యంలో శబరిమల ఆలయం డిసెంబరు 30న తిరిగి తెరుచుకుంటుంది. తీర్థయాత్ర సీజన్ ముగింపునకు చిహ్నంగా జనవరి 20న ఆలయ ద్వారాలను మూసివేస్తారు.

ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయం సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన రెండేళ్లు కోవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో భక్తుల సందర్శనను పరిమితంగా, రోజుకు 30 వేల మందిని మాత్రమే అనుమతించారు. ఈసారి అలాంటి ఆంక్షలు లేవు. శబరిమాల యాత్ర సవ్యంగా సాగేందుకు తగిన బందోబస్తును ఏర్పాటుచేశారు.

భారీగా వస్తున్న అయ్యప్ప భక్తులు

బుధవారం సాయంత్రం దాదాపు 30 వేల మంది భక్తులు దర్శనం కోసం వచ్చారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపన్ చెప్పారు.

గురువారం ఉదయం 41 రోజుల వార్షిక మండలం-మకరవిళక్కు యాత్రా సీజన్ ప్రారంభమైనందున దాదాపు 50 వేల మంది భక్తులు దర్శనం కోసం చేరుకుంటారని అంచనా. వర్చువల్ క్యూ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ అంచనా లెక్కించారు. ఇవికాకుండా ఇంకా స్పాట్ బుకింగ్స్ కూడా ఉంటాయి.

‘రోజువారీగా 40 వేలకు పైగా వర్చువల్ క్యూ బుకింగ్స్ ఉన్నాయి. రానున్న 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులు వస్తారని అచంనా. గత ఏడాది ఈ సీజన్‌లో మొత్తంగా 27 లక్షల మంది దర్శనానికి వచ్చారు..’ అని అనంతగోపన్ తెలిపారు.

శబరిమలలో దక్షిణాది భాషల్లో సమాచారం

భారీగా భక్తులు తరలివస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేశామని, విభిన్న శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కేరళ మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల యంత్రాంగంతో కూడా సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆలయం వద్ద ఉండే సమాచారం యాత్రికులకు అర్థమయ్యేలా విభిన్న భాషల్లో ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు చెప్పారు. అందువల్ల దక్షిణాది రాష్ట్రాల భాషల్లో సమాచారాన్ని డిస్‌ప్లే చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని దేవస్థానం బోర్డులు కలిసి పనిచేస్తున్నాయని, తాత్కాలిక బస చేసేందుకు వీలుగా ఆయా దేవస్థానాలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు.

పోలీసు విభాగం, ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, స్థానిక యంత్రాంగం అయ్యప్ప భక్తులు క్షేమంగా తమ యాత్రను పూర్తిచేసుకునేలా సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు.

ఆసుపత్రి, ఆంబులెన్సులు

పతనంథిట్ట జనరల్ హాస్పిటల్‌లో 24 గంటలు పనిచేసేలా ప్రత్యేకంగా 18 పడకలతో శబరిమల వార్డ్ ఏర్పాటు చేశామని, అందులో లాబ్ టెస్ట్స్ ఉచితంగా చేస్తామని హెల్త్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎవరైనా యాత్రికులు చాతీ నొప్పి, గుండె నొప్పి వస్తే వారిని ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేలా హెల్త్ వర్కర్లు, రవాణా సదుపాయాన్ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

వృద్ధులు ఆలయానికి చేరుకోవడంలో ఇబ్బంది పడితే వారిని ఎత్తుకెళ్లడానికి సహాయకులను కూడా ఏర్పాటు చేసినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

యాత్రా రూట్‌లో దాదాపు 400 కి.మీ. పొడవునా ప్రమాదాల నివారణకు, అత్యవసర సేవలకు ఆంబులెన్స్, తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు మోటార్ వెహికిల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. మూడు కంట్రోల్ రూమ్‌ల ద్వారా యాత్రా మార్గాలను పర్యవేక్షించనున్నట్టు తెలిపింది. 13 వేల మంది పోలీసులు, గగన తలం నుంచి నిఘా, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని పోలీసు విభాగం తెలిపింది. 3 తాత్కాలిక పోలీస్ స్టేషన్లు, ఎన్‌డీఆర్ఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందుబాటులో ఉంటాయని పోలీసు విభాగం తెలిపింది.

ఇక యాత్రికుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తమిళనాడు ఆర్టీసీ విభాగం తెలిపింది. నవంబరు 17 నుంచి జనవరి 20 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. పంబ వరకు ఈ బస్సులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. చెన్నై, తిరుచిరాపల్లి, మధురై, కడలూరు నుంచి ఈ బస్సులు నడుస్తాయని కేరళ రవాణా మంత్రి ఎస్.ఎస్.శివశంకర్ తెలిపారు.

ఇక రైల్వే శాఖ కూడా శబరిమలకు ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతోంది.