Karauli murder case : దళిత యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్- అసలేం జరిగిందంటే!..
16 July 2023, 11:34 IST
Karauli murder case : రాజస్థాన్‌లో దళిత యువతి హత్య కేసుకు సంబంధించి.. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు, నిందితుడికి ముందే పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది.
దళిత యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
Karauli murder case : రాజస్థాన్‌లో సంచలనంగా మారి, తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిన దళిత యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల విచారణలో భాగంగా కీలక విషయాలు బయటపడ్డాయి.
ఇదీ జరిగింది..
రాజస్థాన్ కరౌలి జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో.. 18ఏళ్ల దళిత యువతి మృతదేహం గురువారం నాడు బావిలో లభించింది. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో నిరసనకు దిగారు. యువతిని కొందరు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం చంపేశారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. బులెట్ గాయంతో ఆమె మరణించినట్టు తేలింది.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం నాడు ప్రధాన నిందితుడు గోలు మీనా అలియాస్ ప్రభాకర్‌ను, అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. బాధితురాలు, నిందితుడు ఒకే గ్రామంలో నివాసముండేవారు.
"మంగళవారం అర్ధరాత్రి.. దళిత యువతిని గోలు మీనా తన తండ్రి ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను రేప్ చేశాడు. అనంతరం తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ నేరంలో అతని తండ్రి పాత్ర కూడా ఉంది. వారిద్దరు కలిసి మృతదేహాన్ని బావిలో పడేశారు. నిందితుడితో పాటు అతని తండ్రిని కూడా అరెస్ట్ చేశాము. విచారణలో వారు నిజాన్ని ఒప్పుకున్నారు," అని కరౌలి ఎస్పీ మమతా గుప్తా వెల్లడించారు.
ఇదీ చూడండి:- Karauli rape case : దళిత యువతి హత్యపై రాజస్థాన్‌లో నిరసనలు..!
ఎందుకు చంపాడు..?
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బాధుతురాలికి, నిందితుడికి ముందే పరిచయం ఉందని తేలింది. బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమెకు గోలు మీనాతో జీవితాన్ని పంచుకోవాలని, వారిద్దరు కలిసి ఉండాలని ఉందని సమాచారం. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోదామని గోలును ఆమె అనేకమార్లు ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని, చివరికి యువతిని నిందితుడు రేప్ చేసి చంపేశాడని పోలీసులు చెప్పారు.
Rajasthan rape case : "మృతదేహాన్ని బావిలో పడేసిన తర్వాత.. గోలు, అతని తండ్రి అమర్ సింగ్‌లు ఊరి విడిచి పారిపోయారు. మేము వాళ్లని పట్టుకున్నాము," అని పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు.. ప్రధాన నిందితుడిని పట్టుకున్న తర్వాత.. యువతి మృతదేహాన్ని తన కుటుంబానికి అప్పగించారు పోలీసులు. మృతదేహానికి శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.
రాజకీయ దుమారం..
Rajasthan murder case : కరౌలి రేప్ కేసు ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసనలను విరమించుకున్నారు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆడబిడ్డలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోతోందని, ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.