Rajasthan crime news : బావిలో దళిత యువతి మృతదేహం.. గ్యాంగ్​ రేప్​ చేసి చంపేశారా?-rajasthan crime news dalit girl found dead in well in karauli district bjp mp alleges rape and murder ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan Crime News : బావిలో దళిత యువతి మృతదేహం.. గ్యాంగ్​ రేప్​ చేసి చంపేశారా?

Rajasthan crime news : బావిలో దళిత యువతి మృతదేహం.. గ్యాంగ్​ రేప్​ చేసి చంపేశారా?

Sharath Chitturi HT Telugu

Rajasthan crime news : రాజస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల యువతి మృతదేహం బావిలో కనిపించింది. కొందరు ఆమెను రేప్​ చేసి, చంపి, బావిలో పడేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బావిలో యువతి మృతదేహం.. రేప్​ చేసి చంపేశారా?

Rajasthan crime news : 19ఏళ్ల దళిత యువతి మృతదేహం బావిలో కనిపించిన ఘటన రాజస్థాన్​లో కలకలం రేగింది. ఈ ఘటనపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను చంపేసి, బావిలో పడేశారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇదీ జరిగింది..

రాజస్థాన్​ కరౌలి జిల్లాలోని హిందౌన్​ నగరంలో ఉన్న బావిలో గురువారం యువతి మృతదేహం కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని బావిలో నుంచి తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు.. బాల్ఘట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి అని గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమచారం అందించారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ కిరోది లాల్​ మీనా.. ఆసుపత్రికి వెళ్లారు. అదే సమయంలో అనేకమంది బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్లారు.

Rajasthan rape case : "నదోతి ప్రాంతం నుంచి బాధితురాలు ఇంటికి వెళుతుండగా.. కొందరు దుండగులు ఆమెను అపహరించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను చంపి, బావిలో పడేశారు," అని ఎంపీ మీనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత, బాధిత కుటుంబంతో మాట్లాడతామని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

"యాసిడ్​ దాడులు, రేప్​లపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. కానీ ఇక్కడి ప్రభుత్వం అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టడం లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాము," అని ఎంపీ మీనా అన్నారు.

'పోలీసుల నిర్లక్షం..!'

మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి, పోలీసుల తీరుపైనా బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Dalit girl dead in Rajasthan : "బాధితురాలు కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు వారి మాటలను, ఫిర్యాదును పట్టించుకోలేదు. సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు చేపట్టాలి," అని బీజేపీ రాజస్థాన్​ కిసాన్​ మోర్చా ఉపాధ్యక్షుడు ధర్మ దాగుర్​ మండిపడ్డారు. ఇంత జరిగినా.. జిల్లా కలెక్టర్​ కానీ, జిల్లా ఎస్​పీ కానీ ఆసుపత్రికి రాలేదని, ఫలితంగా అధికారుల నిర్లక్షం స్పష్టమవుతోందని ఆరోపించారు.

నిందితులను వెంటనే పట్టుకోవాలని సర్వత్రా డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబానికి రూ. 20లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని దాగుర్​ డిమాండ్​ చేశారు.

బీజేపీ నేతలు, కార్యకర్తల నిరసనలతో ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు.. పరిస్థితిని అదుపుచేశారు. నిందితులను పట్టుకుంటామని హామీనిచ్చారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.