Delhi rape case : పోలీసు అధికారి అని చెప్పి.. యువతిపై అత్యాచారం!
14 July 2023, 7:56 IST
Delhi rape case : ‘నువ్వు, నీ బాయ్‌ఫ్రెండ్ కలిసి ఉన్న వీడియోలు నా దగ్గర ఉన్నాయి. సోషల్ మీడియాలో లీక్ చేస్తా,’ అని బెదిరించిన ఓ వ్యక్తి, ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను దిల్లీ పోలీసును అంటూ చెప్పుకొచ్చాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
పోలీసు అధికారి అని చెప్పి.. యువతిపై అత్యాచారం!
Delhi rape case : పోలీసు అధికారిని అంటూ.. ఓ 20ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దిల్లీలో జరిగిన ఈ ఘటన వార్తలకెక్కింది.
ఇదీ జరిగింది..
దిల్లీలోని ఓ గేటెడ్ సొసైటీలో జులై 7 రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాలు.. తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళుతుండగా.. మెట్ల మార్గంలో ఓ వ్యక్తి ఆమెను అడ్డుకున్నాడు. తనని తాను, దిల్లీ పోలీసు అధికారి అని పరిచయం చేసుకున్నాడు. ఓ ఐడీ కార్డును కూడా చూపించాడు! యువతికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఇంతలో ఆ వ్యక్తి, యువతిని బెదిరించాడు.
"నువ్వు, నీ బాయ్‌ఫ్రెండ్ సన్నిహితంగా ఉన్న వీడియో నా దగ్గర ఉంది. ఇది మీ ఇంట్లో వాళ్లకి చూపిస్తాను. సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను," అని ఆ వ్యక్తి అనడంతో యువతి భయపడిపోయింది. ఆ తర్వాత, ఆమెను బెదిరించి ఇంటి మీదకు తీసుకెళ్లాడు. అక్కడే 20ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే, వీడియోను లీక్ చేస్తానని బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
తనకు ఎదురైన ఘటనతో యువతి భయపడిపోయింది. కొన్ని రోజుల పాటు ఎవరికి ఏం చెప్పలేదు. చివరికి ధైర్యం తెచ్చుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనకు జరిగినది వివరించింది. దిల్లీ పోలీసు నుంచి ఓ వ్యక్తి తనను రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే.. నిందితుడు పేరు రవి సొలంకి అని, అతను అసలు పోలీసుశాఖలోనే పనిచేయడం లేదని తెలుసుకున్నారు.
Delhi crime news : "కష్టమైన కేసును మేము ఛేదించాము. నిందితుడి వివరాలు ఎవరికి తెలియదు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో అతని ముఖాన్ని గీయించాము. మరోవైపు అత్యాచారానికి పాల్పడిన తర్వాత.. ఓ బైక్ మీద అతను రైథల మెట్రో స్టేషన్ వరకు వెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉంది. కానీ అక్కడి నుంచి మాయమైపోయాడు. 250కిపైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించాము. 40మందినిపైగా వ్యక్తులను విచారించాము. 1000కిపైగా వాహనాలను పరీక్షించాము. చివరికి.. గురువారం అతడిని పట్టుకున్నాము. మాకు అందిన సమాచారంతో సెక్టార్ 24లోని ఓ మాల్‌కు వెళ్లి, అతడిని అరెస్ట్ చేశాము," అని పోలీసు అధికారి వెల్లడించారు.
నిందితుడిని విచారించిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు.
"ఆమెను, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను నేను చాలా రోజులుగా ఫాలో అయ్యాను. కారులో ఉన్నప్పుడు వారి ఫొటోలను తీశాను. ఆమె ఒంటరిగా ఉండటం కోసం ఎదురుచూశాను. ఇండియాలో మహిళలు, వారి బాయ్‌ఫ్రెండ్స్ గురించి తల్లిదండ్రులకు చెప్పరు. అలా ఆమెను భయపెట్టాను," అని నిందుతుడు పోలీసులకు వివరించాడు.
33ఏళ్ల సొలంకి.. పూత్ కలాన్ గ్రామానికి చెందినవాడు. 2016లో అతనికి పెళ్లి జరిగింది. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్మగ్లింగ్‌కు సంబంధించి అతనిపై ఇప్పటికే 5 కేసులు ఉన్నాయి.
ఐడీ కార్డు కూడా ఫేక్..!
Delhi woman raped : ఘటన జరిగిన సమయంలో యువతికి నిందితుడు చూపించిన ఐడీ కార్డు ఫేక్ అని తేలింది. తన వద్ద ఉన్న ఆర్మ్స్ లైసెన్స్‌ను చూపించి, అది దిల్లీ పోలీసు కార్డు అని అబద్ధం చేప్పాడు. దానిపై దిల్లీ పోలీసు విభాగానికి చెందిన వాటర్‌మార్క్, మోనోగ్రామ్ ఉండటంతో బాధితురాలు నమ్మేసింది.