Karauli rape case : దళిత యువతి హత్యపై రాజస్థాన్లో నిరసనలు..!
Karauli rape case : రాజస్థాన్లో దళిత యువతి హత్య నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వైఖరిపై బీజేపీ మండిపడుతోంది. మరోవైపు యువతి మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.
Karauli rape case : రాజస్థాన్లో దళిత యువతి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. యువతి మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు తెలిశాయి. మరోవైపు ప్రభుత్వ వైఖరిపై విపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తోంది.
పోస్టుమార్టంలో ఏముంది..?
కరౌలి జిల్లాలో ఉన్న ఓ గ్రామానికి సమీపంలోని ఓ బావిలో ఓ దళిత యువతి మృతదేహాన్ని గురువారం గుర్తించారు. ఆమెపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు, అనంతరం హత్య చేసి, బావిలో పడేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
19ఏళ్ల దళిత యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. తుపాకీ కాల్పుల కారణంగా ఆమె మరణించినట్టు తేలింది. అయితే.. మరణానికి ముందు, యువతిపై అత్యాచారం జరిగిందా? లేదా? పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది? అన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.
మరోవైపు పోలీసు వ్యవస్థపై బాధితురాలి తల్లి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.
"ఇంట్లో మేము పడుకున్నాము. తెల్లవారుజామున 3 గంటలకు కొందరు ఇంట్లోకి చొరబడ్డారు. నా బిడ్డ నోట్లో గుడ్డలు కుక్కారు. ఆమెను అపహరించారు. నేను అరిచినా, ఎవరూ సాయానికి రాలేదు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లాము. మా ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. 'ఫిర్యాదు చేస్తే ఫలితం ఉండదు. తిరిగి వెళ్లిపోండి,' అని పోలీసులు మాకు చెప్పారు. కేసు కూడా ఫైల్ చేయలేదు," అని బాధితురాలి తల్లి మీడియాకు వివరించారు.
Rajasthan rape case : దళిత యువతి తల్లి ఆరోపణలపై పోలీసులు స్పందించలేదు. కాగా ఈ కేసులో తమకు లీడ్ దొరికిందని వివరించారు.
"కేసుకు సంబంధించి మాకు ఓ లీడ్ దొరికింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాము. బాధితురాలి తల్లితో కూడా మాట్లాడుతున్నాము. ఆమెకు ఎవరి మీదైనా అనుమానం ఉందేమో తెలుసుకుంటున్నాము. ఆమె ఇంకా ఎవరి పేరు చెప్పలేదు. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశాము," అని పోలీసులు వెల్లడించారు.
రాజకీయ దుమారం..
రాజస్థాన్లో దళిత యువతి మరణంపై తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం రేగింది. యువతి మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన కొరవడటం బాధాకరమని మండిపడ్డారు.
Dalit girl raped in Rajasthan : మరోవైపు ఈ విషయంపై రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ శుక్రవారం నాడు ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం మౌనంగా ఉండకూడదని, సమాధానం ఇవ్వాలని, పోలీసుల నిర్లక్షానికి జవాబివ్వాలని నిలదీసింది. రాజస్థాన్ కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చశారు.
బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ మండిపడింది. సున్నితమైన అంశంపై రాజకీయం చేయవద్దని పేర్కొంది. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. నిరసనలు చేయడంలో అర్థం ఉందని, కానీ దర్యాప్తు వేగంగా సాగుతున్నా ఎందుకు ఆందోళనలు చేయడం అని మండిపడింది.
సంబంధిత కథనం