తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rain Alert : తమిళనాడుకు భారీ వర్ష సూచన- 4 రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

Rain alert : తమిళనాడుకు భారీ వర్ష సూచన- 4 రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

Sharath Chitturi HT Telugu

12 October 2024, 7:30 IST

google News
    • Chennai rains today : తమిళనాడులో శనివారం నుంచి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు అనేక జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ని జారీ చేసింది.
తమిళనాడులో భారీ వర్షాలు- ఆరెంజ్​ అలర్ట్​ జారీ..
తమిళనాడులో భారీ వర్షాలు- ఆరెంజ్​ అలర్ట్​ జారీ..

తమిళనాడులో భారీ వర్షాలు- ఆరెంజ్​ అలర్ట్​ జారీ..

తమిళనాడు ప్రజలకు అలర్ట్​! ఈ నెల 12 నుంచి 15 వరకు తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్​ఎంసీ) వెల్లడించిది. ఈశాన్య రుతుపవనాలు త్వరలో ప్రవేశించేందుకు వాతావరణం సహకరిస్తుండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, చెంగల్​పట్టు సహా మొత్తం 10 జిల్లాలకు అరెంజ్​ అలర్ట్​ని జారీ చేశారు. భారీ వర్షాలు, అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఆరెంజ్ అలర్ట్ సూచిస్తుంది.

అరేబియా సముద్రంలో అల్పపీడనం..

తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన వాయుగుండం దక్షిణ తమిళనాడు తీరం మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఆర్ఎంసీ వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సెంతమరై కన్నన్​ తెలిపారు.

వచ్చే వారం రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆర్ఎంసీ అంచనా వేసింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలతో పాటు కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది. నీలగిరి, ఈరోడ్, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, తేని, విరుదునగర్, తెన్కాశి, మదురై, శివగంగ, రామనాథపురం, పుదుకోట్టై జిల్లాలకు వర్ష సూచన ఉంది.

ఇదీ చూడండి:- AP TG Rain ALERT : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఈ 2 రోజులు ఉరుములతో కూడిన వానలు, ఆ తేదీన రాయలసీమలో అతి భారీ వర్షాలు..!

గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

రోజుల తరబడి ఎండల తర్వాత చెన్నైలో శుక్రవారం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మరో రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 32-33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25-26 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని ఆర్ఎంసీ తెలిపింది. రాగల 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.

మరోవైపు గోవా, ఉత్తర కర్ణాటక తీరాలకు సమీపంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంపై అక్టోబర్ 10 నుంచి ఏర్పడిన లో- డిప్రెషన్​ వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 11 ఉదయం మహారాష్ట్ర తీరానికి సమీపంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడినట్లు ఆర్ఎంసీ తెలిపింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 13 ఉదయం నాటికి మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఆర్ఎంసీ వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సెంతమరై కన్నన్ తెలిపారు.

మహారాష్ట్ర తీరంలోని తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ కేరళ తీరంలో ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు అల్పపీడన ద్రోణి మిడిల్​ ట్రోపోస్పెరిక్ స్థాయి వరకు విస్తరించి ఉందని ఆయన వెల్లడించారు.

తదుపరి వ్యాసం