AP Rains : ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు- ఈ నెలలో రెండు తుపాన్లు!
07 October 2024, 18:13 IST
- AP Rains : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ నెలలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పాడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాన్ల ప్రభావంతో ఈ నెల 10 నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు- ఈ నెలలో రెండు తుపాన్లు!
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం మన్యం,అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్తొంది.
ఈ నెల 10 నుంచి ఏపీలో వర్షాలు
అక్టోబరు నెలలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్ల ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఈ తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ నెలలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ల ప్రభావంతో ఈ నెల 10 తర్వాత ఏపీలోని కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో సోమవారం మోస్తరు వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 8న మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.