UGC NET new exam date : యూజీసీ నెట్ పరీక్ష తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
29 June 2024, 5:38 IST
- UGC NET new exam date : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను జూన్ 18న నిర్వహించిన మరుసటి రోజే రద్దైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త డేట్స్‌ని ప్రకటించారు. ఆ వివరాలు..
యూజీసీ నెట్ పరీక్ష కొత్త డేట్స్‌పై వివరాలు..
పరీక్ష జరిగిన మరుసటి రోజే యూజీసీ నెట్ రద్దైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు యూజీసీ నెట్ పరీక్ష కొత్త డేట్స్‌ని ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏన్టీఏ. యూజీసీ నెట్ 2024.. ఆగస్టు 21-సెప్టెంబర్ 4 వరకు జరుగుతుందని ప్రకటించింది ఎన్టీఏ. దానితో పాటు రద్దైన, వాయిదా పడిన ఇతర పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది. వాటిని ఇక్కడ చూడండి.
యూజీసీ నెట్ పరీక్ష తేదీ వివరాలు..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను (యూజీసీ నెట్) జూన్ 18న నిర్వహించిన మరుసటి రోజే రద్దు చేయడం జరిగింది. పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లినట్లు విద్యాశాఖకు సమాచారం అందడంతో రద్దు చేశారు.
ప్రశ్నాపత్రం డార్క్ నెట్ లో లీక్ అయిందని, టెలిగ్రామ్ యాప్‌లో సర్క్యులేట్ అయిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతను నిర్ణయించే పరీక్ష ఈ యూజీసీ-నెట్.
మునుపటి పద్ధతికి భిన్నంగా ఈ ఏడాది ఆఫ్‌లైన్ విధానంలో, ఒకే రోజు పరీక్షను నిర్వహించారు. అయితే రీషెడ్యూల్ చేసిన పరీక్షను గతంలో ఉన్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం ప్రకారమే నిర్వహిస్తారు.
పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముందస్తు చర్యగా వాయిదా వేసిన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యూజీసీ-నెట్‌ను జూలై 25 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్‌లో పీహెచ్డీ ప్రవేశాలకు సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్‌ని స్వీకరిస్తారు.
జూన్ 12న ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు వాయిదా పడిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి, నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ని జూలై 10న నిర్వహించనున్నారు.
ఐఐటీలు, ఎన్ఐటీలు, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కళాశాలలతో సహా ఎంపిక చేసిన కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు లేదా సంస్థలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
అడ్మిట్ కార్డులు విడుదల చేసే తేదీలతో పాటు మరిన్ని వివరాలపై త్వరోనే ఎన్టీఏ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
పేపర్ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి..
పేపర్ లీక్, స్కామ్‌లతో భారత దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నీట్ యూజీ 2024, యూసీజీ నెట్లో అవకతవకలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ నీట్-యూజీ, పీహెచ్డీ ఎంట్రెన్స్ నెట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ ద్వారా పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్రం గత వారం ఒక ప్యానెల్‌ని నోటిఫై చేసింది.
పేపర్ లీకేజీ సహా పలు అవకతవకలపై నీట్ విచారణ జరుగుతుండగా, పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లినట్లు మంత్రిత్వ శాఖకు సమాచారం అందడంతో పరీక్ష జరిగిన 24 గంటల్లోనే యూజీసీ-నెట్‌ను రద్దు చేశారు. మరో రెండు పరీక్షలు సీఎస్ఐఆర్-యూజీసీ నెట్, నీట్-పీజీలను ముందస్తు చర్యగా రద్దు చేశారు.