Anti Paper Leak Law : 'పేపర్ లీక్'పై పోరాటానికి కొత్త చట్టం అమలు- ఫలితం దక్కేనా?
22 June 2024, 6:11 IST
- Anti Paper Leak Law : పేపర్ లీక్స్‌ని అడ్డుకునేందుకు కఠినమైన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం.. దోషులకు రూ. కోటి వరకు జరిమానా, గరిష్ఠంగా 10ఏళ్ల వరకు జైలు శిక్షపడుతుంది.
ఇక పేపర్ లీక్ చేస్తే.. భారీ జరిమానా, 10ఏళ్ల జైలు శిక్ష!
Anti Paper Leak Law rules : పేపర్ లీక్‌లతో భారత దేశం, విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో కీలకమైన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పేపర్ లీక్‌లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు.. పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ని శుక్రవారం అమలు చేసింది. ఈ మేరకు.. ఒక గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది.
శుక్రవారం అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం.. పేపర్ లీక్‌లకు బాధ్యులుగా తేలినా, ఆన్సర్ షీట్‌ని టాంపర్ చేశారని రుజువైనా.. సంబంధిత వారిపై 3ఏళ్ల శిక్ష పడుతుంది. తీవ్రత బట్టి దీనిని 5ఏళ్ల వరకు పొడగించవచ్చు. పైగా.. ఇవన్నీ నాన్-బెయిలెబుల్ నేరాలుగా పరిగణిస్తారు.
పేపర్ లీక్ వ్యవహారం తెలిసినా, అధికారులకు సమాచారం ఇవ్వన్ని ఎగ్జామినేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు.. తాజా చట్టం ప్రకారం రూ. 1 కోటి వరకు జరిమానా పడుతుంది.
What is Anti Paper Leak Law : ఒక వేళ సీనియర్ అధికారులు.. పేపర్ లీక్‌లను చూస్తూ ఉండిపోయినా, ప్రత్యక్షంగా-పరోక్షంగా లీక్స్‌కి మద్దతిచ్చినా.. సంబంధిత వ్యక్తులపై కనీసం 3ఏళ్లు, లేదా 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. రూ. 1 కోటి ఫైన్ విధిస్తారు.
ఒక వేళ ఎగ్జామినేషన్ అథారిటీ, సర్వీస్ ప్రొవైడర్ నేరానికి పాల్పడినట్టు రుజువైతే.. కనీసం 5ఏళ్ల, గరిష్ఠంగా 10ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. రూ. 1 కోటి వరకు ఫైన్ పడుతుంది.
వాస్తవానికి.. ఈ చట్టం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పార్లమెంట్లో గట్టెక్కింది. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల హడావుడిలో ఇది అమల్లోకి రాలేదు. కానీ.. తాజాగా నీట్ యూజీ 2024, యూసీజీ నెట్ 2024 పరీక్షల్లో పేపర్ లీక్‌లు కలకలం సృష్టించడంతో.. ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది కేంద్రం.
పేపర్ లీక్స్‌తో దేశం ఉక్కిరిబిక్కిరి..
Anti Paper Leak Law : మేలో జరిగిన నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. పరీక్ష ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 67 మంది టాపర్లుగా నిలవడం, 1500మందికి గ్రేస్ మార్కులు ఇవ్వడం, ఆ గ్రేస్ మార్కుల ఫార్ములాను ప్రకటించకపోవడంతో అనుమానాలు పెరిగాయి. సర్వత్రా ఆందోళనలు మొదలయ్యాయి.
వీటన్నింటి మధ్య.. ఇటీవలే జరిగిన యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం మరింత ఆందోళనకు గురిచేసింది. పరీక్షను మరుసటి రోజే రద్దు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.
NEET paper leak : ఇక పేపర్ లీక్స్‌పై అధికారాన్ని టార్గెట్ చేస్తూ, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. 5ఏళ్లల్లో 45కుపైగా పేపర్ లీక్స్ జరిగాయని, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించాయి.