Necrophilia: ‘మృతదేహాలతో సంభోగం’పై.. ‘ఆ నేరానికి శిక్ష లేదు’ అంటూ కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు-karnataka high court urges legal reforms on necrophilia what you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Necrophilia: ‘మృతదేహాలతో సంభోగం’పై.. ‘ఆ నేరానికి శిక్ష లేదు’ అంటూ కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Necrophilia: ‘మృతదేహాలతో సంభోగం’పై.. ‘ఆ నేరానికి శిక్ష లేదు’ అంటూ కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 03:14 PM IST

Necrophilia: మహిళలను చంపేసి, వారి మృతదేహాలతో సెక్స్ (Necrophilia) చేసే వారికి విధించే శిక్షల విషయంలో న్యాయపరమైన స్పష్టమైన మార్పులు అవసరమని కర్నాటక హై కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా మృతదేహాలపై లైంగిక చర్యలకు పాల్పడిన నేరానికి ఐపీసీలో స్పష్టమైన శిక్షలు లేవని కర్నాటక హైకోర్టు వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Getty Images/Picture for representation)

మహిళలను చంపేసి, వారి మృతదేహాలతో సెక్స్ (Necrophilia) చేసే వారికి విధించే శిక్షల విషయంలో న్యాయపరమైన స్పష్టమైన మార్పులు అవసరమని కర్నాటక హై కోర్టు వ్యాఖ్యానించింది. సాధారణంగా మృతదేహాలపై లైంగిక చర్య జరిపడాన్ని నెక్రొఫీలియా (Necrophilia) అనే మానసిక వ్యాధిగా భావిస్తారు. ఇలా మృతదేహాలపై లైంగిక చర్యలకు పాల్పడే నేరాలకు ఐపీసీలో స్పష్టమైన శిక్షలు లేవని కర్నాటక హైకోర్టు వెల్లడించింది. నెక్రోఫీలియా అనేది గ్రీక్ పదం. ఇందులో నెక్రో (Necro) అంటే చనిపోయిన (dead) అని అర్థం. ఫీలియా (philia) అంటే అత్యంత ఇష్టం లేదా ఆకర్షణ (love or attraction) అని అర్థం.

Necrophilia: నెక్రొఫీలియా.. ఈ నేరానికి శిక్ష లేదు

2015 నాటి ఒక కేసులో 22 ఏళ్ల నిందితుడిని కర్నాటక హై కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆ యువకుడు 21 ఏళ్ల వయస్సున్న ఒక యువతిని హత్య చేసి, అనంతరం ఆ యువతి మృతదేహంపై లైంగిక చర్య (Necrophilia) కు పాల్పడినట్లుగా నిర్ధారణ అయింది. అయితే, హత్యా నేరాన్ని నిర్ధారించి, ఐపీసీ 302 సెక్షన్ కింద ఆ యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించిన హై కోర్టు.. మృతదేహంపై లైంగిక చర్యకు పాల్పడిన నేరం విషయంలో మాత్రం శిక్ష విధించలేదు. మృతదేహంపై లైంగిక చర్యకు పాల్పడినట్లుగా నిర్ధారణ అయినప్పటికీ.. ఐపీసీ (Indian Penal Code IPC) లో ఈ నేరానికి ఏ సెక్షన్ కింద కూడా స్పష్టమైన శిక్ష లేకపోవడంతో హైకోర్టు ఆ నేరానికి శిక్షవిధించలేకపోయింది. కర్నాటక హై కోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ బీ వీరప్ప, జస్టిస్ వెంకటేశ్ నాయక్ లు అదే విషయాన్ని చెబుతూ.. ఈ నేరానికి సంబంధించి శిక్షాస్మృతిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Reforms in IPC: ఐపీసీ సెక్షన్ 377 కు సవరణలు

‘‘చట్టంలో జీవించి ఉన్న వ్యక్తిపై బలవంతంగా లైంగిక దాడి చేస్తే ఏ శిక్ష విధించాలనే విషయం స్పష్టంగా ఉంది. కానీ, మరణించిన వ్యక్తిపై, అంటే మృతదేహంపై లైంగిక దాడి చేస్తే ఏ శిక్ష విధించాలనే విషయం లేదు’’ అని కర్నాటక హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. అందువల్ల ఈ నేరాన్ని కూడా భారతీయ శిక్షాస్మృతిలో చేర్చి సముచిత శిక్షను సిఫారసు చేయాలని, ఐపీసీ (IPC) సెక్షన్ 375, సెక్షన్ 376, సెక్షన్ 377 లకు సవరణలు చేయాలని సూచించింది. ‘‘సెక్షన్ 375, సెక్షన్ 376, సెక్షన్ 377 లలో జీవించి ఉన్నవారిపై అత్యాచారానికి సంబంధించి మాత్రమే ఏ శిక్షలు వేయాలనే అంశం ఉంది. ఇప్పుడు ఆ సెక్షన్ 377 కు సవరణలు చేసి.. మృతదేహాలపై, అది స్త్రీ మృతదేహమైనా, లేక పురుషుడి మృతదేహమైనా, లేదా జంతువుల మృతదేహమైనా.. లైంగిక దాడులు చేయడాన్ని నేరంగా ఎంచి, శిక్షను నిర్ధారించాలని కర్నాటక హై కోర్టు సూచించింది. యూకే (UK) తదితర దేశాల్లో ఈ నేరానికి స్పష్టమైన శిక్షలున్నాయని కోర్టు గుర్తు చేసింది.

Whats_app_banner