NEET-UG 2024 row: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్రం, ఎన్టీఏలకు సుప్రీంకోర్టు నోటీసులు-neetug 2024 row supreme court seeks responses from centre nta ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet-ug 2024 Row: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్రం, ఎన్టీఏలకు సుప్రీంకోర్టు నోటీసులు

NEET-UG 2024 row: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్రం, ఎన్టీఏలకు సుప్రీంకోర్టు నోటీసులు

HT Telugu Desk HT Telugu
Published Jun 20, 2024 01:45 PM IST

NEET-UG row: నీట్-యూజీ నిర్వహణలో అవకతవకలను సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లపై సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8 వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

జులై 8న నీట్ పిటిషన్లపై తదుపరి విచారణ
జులై 8న నీట్ పిటిషన్లపై తదుపరి విచారణ (HT_PRINT)

NEET-UG row: నీట్-యూజీ 2024ను రద్దు చేయాలని, వైద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), ఇతర సంబంధిత పక్షాల నుంచి సుప్రీంకోర్టు స్పందనలు కోరింది. పలు హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న నీట్ యూజీ 2024 సంబంధిత పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల వెకేషన్ బెంచ్ గురువారం విచారణ జరిపింది. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

మాకు కూడా రీ ఎగ్జామ్ పెట్టాలి

నీట్-యూజీ 2024 పరీక్ష సమయంలో తమకు కూడా 45 నిమిషాల సమయం వృథా అయిందని, అందువల్ల గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్ కు అవకాశం ఇచ్చినట్లే తమకు కూడా రీ ఎగ్జామ్ కు అవకాశం ఇవ్వాలని మేఘాలయలోని ఒక పరీక్ష కేంద్రానికి హాజరైన విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది.

జులై 8న తదుపరి విచారణ

ఈ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం జూలై 8కి వాయిదా వేసింది. కాగా, నీట్ యూజీ 2024 ను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ, ఇతర సంబంధిత పక్షాలను ఆదేశించాలని కోరుతూ గతంలో నీట్ యూజీ 2024 రాసిన 20 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా ఎన్టీఏకు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర పరీక్షల అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యార్థులు మరో పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరారు. మే 5న 4,750 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.