UGC NET Cancelled : యూజీసీ నెట్ పేపర్ లీక్, పరీక్ష రద్దు చేసిన ఎన్టీఏ
UGC NET Cancelled : జూన్ 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం రద్దు చేసింది. పేపర్ లీక్ వ్యవహారంతో నెట్ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది.
UGC NET Cancelled : దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష రద్దైంది. పేపర్ లీక్ అయిందని నేషనల్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ కమిటీ సమాచారంతో ఎన్టీఏ యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసింది. పేపర్ లీక్ పై సీబీఐ విచారణకు ఆదేశించింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నెట్ ను అర్హత పరీక్షగా నిర్వహిస్తారు. జూన్ 18న దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ నిర్వహించారు. పేపర్ లీక్ వ్యవహారంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నెట్ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్-2024 పరీక్షను జూన్ 18న రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకాల్లో, పీహెచ్‌డీలో ప్రవేశాలకు యూజీసీ నెట్ నిర్వహిస్తారు. ఈ ఏడాది నెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1205 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 11,21,225 మంది అభ్యర్థులు నెట్ పరీక్షకు నమోదు చేసుకున్నారు. వీరిలో 6,35,587 మంది మహిళలు, 4,85,579 మంది పురుషులు, 59 మంది థర్డ్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు. అయితే రెండు షిఫ్టులకు 9,08,580 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులలో 81% మంది పరీక్షకు హాజరయ్యారని ఎన్టీఏ ప్రకటించింది. నిన్న సాయంత్రం ప్రకటనలో యూజీసీ నెట్ ను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొంది. ఇంతలో కేంద్రం నుంచి అందిన సమాచారంతో పేపర్ లీకైనట్లు తెలిసింది. దీంతో యూజీసీ నెట్-జూన్ 2004 పరీక్ష రద్దు చేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నీట్ పరీక్షలో అవకతవకలతో ఎన్టీఏ పేరు మసకబారింది. తాజాగా నెట్ పేపర్ లీక్ తో ఎన్టీఏ పరీక్ష నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీబీఐ దర్యాప్తునకు ఆదేశం
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్- 2024 పరీక్షను ఓఎమ్ఆర్ విధానంలో జూన్ 18 దేశవ్యాప్తంగా రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. యూజీసీ నెట్ పరీక్షపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు నెట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. పరీక్ష పారదర్శకత, సమగ్రతపై రాజీపడకుండా ఉండేందుకు నెట్ ను రద్దు చేసినట్లు ఎన్టీఏ పేర్కొది. పరీక్ష ప్రక్రియ అత్యున్నత స్థాయి పారదర్శకత, పవిత్రతను కాపాడేందుకు UGC-NET 2024 పరీక్షను రద్దు చేయాలని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించింది.
నీట్ పరీక్ష
నీట్ (UG) పరీక్ష-2024కి సంబంధించిన అంశంలో గ్రేస్ మార్కుల సమస్య ఇప్పటికే పూర్తిగా పరిష్కరించనట్లు ఎన్టీఏ ప్రకటించింది. పాట్నాలో పరీక్ష నిర్వహణలో జరిగిన కొన్ని అవకతవకలకు సంబంధించి, ఆర్థిక నేరాల విభాగం, బీహార్ పోలీసుల నుంచి నివేదికను కోరినట్లు తెలిపింది. ఈ నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. పరీక్షల పవిత్రతను, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది. ఈ విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అలాగే గ్రేస్ మార్కులు రద్దు చేసినట్లు తెలిపింది.
సంబంధిత కథనం