తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Election Results Today : ఆ 3 రాష్ట్రాల్లో గెలుపెవరిది? కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ (ANI)

Election results today : ఆ 3 రాష్ట్రాల్లో గెలుపెవరిది? కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

02 March 2023, 17:44 IST

  • Election results today : ఈశాన్య భారతంలోని మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​లో విజయంపై పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన లైవ్​ అప్డేట్స్​ను హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు.. మీకు అందిస్తోంది.

02 March 2023, 17:44 IST

త్రిపురలో బీజేపీ కూటమికి మెజారిటీ

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ కూటమికి మెజారిటీ లభించింది. 60 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 30 స్థానాల్లో, ఐపీఎఫ్టీ (Indigenous People’s Front of Tripura IPFT)) ఒక సీటులో గెలుపొందాయి. బీజేపీ మరో రెండు సీట్లలో ముందంజలో ఉంది. ఈ విజయంతో బీజేపీ వరుసగా రెండోసారి ఈ ఈశాన్య రాష్ట్రంలో అధికారంలోకి రానుంది.

02 March 2023, 17:03 IST

నాగాలాండ్ లో ఎన్డీపీపీ - బీజేపీ కూటమి విజయం

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ, బీజేపీ కూటమి విజయం సాధించింది. మొత్తం 60 సీట్లకు గానూ ఈ కూటమి 33 స్థానాల్లో విజయం సాధించింది. నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (Nationalist Democratic Progressive Party NDPP)) 21 సీట్లలో, బీజేపీ 12 సీట్లలో విజయం సాధించాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీపీపీ 40 సీట్లలో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేశాయి.

02 March 2023, 16:54 IST

West bengal bypoll: పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బోణీ

పశ్చిమ బెంగాల్ (West bengal bypoll) అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. సాగర్ దిఘి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బేరోన్ బిశ్వాస్ గెలుపొందారు. ప్రస్తుత అసెంబ్లీలో ఇప్పటివరకు కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదు. ఈ ఉప ఎన్నికలో గెలుపుతో ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ (congress) అభ్యర్థి తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. సాగర్ దిఘి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బేరోన్ బిశ్వాస్ సమీప ప్రత్యర్థి టీఎంసీ (TMC) క్యాండిడేట్ దేబాశిశ్ బెనర్జీపై సుమారు 23 వేల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2021లో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో అటు కాంగ్రెస్ కానీ, ఇటు లెఫ్ట్ ఫ్రంట్ కానీ కనీసం ఒక్క సీటులోనూ గెలుపొందలేక పోయాయి. రాష్ట్రంలో ఒకప్పుడు అధికారం చెలాయించిన పార్టీలకు ఈ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం అప్పుడు సంచలనంగా మారింది. 

02 March 2023, 14:16 IST

మేఘాలయ ఫలితాలపై సీఎం కన్రాడ్ సంగ్మా స్పందన

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా స్పందించారు. మెజారిటీ సాధించడానికి మరికొన్ని అడుగుల దూరంలో ఉన్నామని, పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. నేషనల్ పీపుల్స్ పార్టీకి ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన, మెజారిటీలో ఉన్న స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే, మెజారిటీకి మరికొన్ని సీట్లు తక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోందని, అందువల్ల పూర్తిగా ఫలితాలు వెలువడిన తరువాత స్పందిస్తానని తెలిపారు. మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. సీఎం సంగ్మాకు చెందిన ఎన్పీపీ (National People's Party NPP) 5 స్థానాల్లో గెలుపొందింది. మరో 21 స్థానాల్లో మెజారిటీలో ఉంది. 60 సీట్ల అసెంబ్లీలో మేజిక్ మార్క్ 31. మరోవైపు, యూడీపీ 2 సీట్లలో గెలుపొంది, 8 స్థానాల్లో మెజారిటీలో ఉంది. బీజేపీ 3 స్థానాల్లో మెజారిటీలో కొనసాగుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. చెరో నాలుగు స్థానాల్లో మెజారిటీలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ మఘాలయాలో హంగ్ అసెంబ్లీ తప్పదనే సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. కౌంటింగ్ కు ముందే సీఎం కన్రాడ్ సంగ్మా, అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

మేఘాలయ సీఎం, ఎన్పీపీ నేత కన్రాడ్ సంగ్మా
మేఘాలయ సీఎం, ఎన్పీపీ నేత కన్రాడ్ సంగ్మా (Anuwar Hazarika )

02 March 2023, 14:00 IST

మహారాష్ట్ర ఉప ఎన్నికల ఫలితాలు

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న కస్బపేట్, చించ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ స్థానాల కౌంటింగ్ కూడా నేడు కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం వరకు జరిగిన కౌంటింగ్ మేరకు.. కస్బ స్థానంలో కాంగ్రెస్, చించ్వాడ్ స్థానంలో బీజేపీ ముందంజలో ఉన్నాయి. కస్బపేట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రవీంద్ర ధాంగేకర్ 9వ రౌండ్ కౌంటింగ్ ముగిసేటప్పటికీ బీజేపీ అభ్యర్థి హేమంత్ రసానే పై సుమారు 4,500 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. అలాగే, పుణెలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న చించ్వాడ్ స్థానంలో 6 రౌండ్ల కౌంటింగ్ ముగిసేటప్పటికీ బీజేపీ అభ్యర్థి జగ్తాప్ సమీప ఎన్సీపీ అభ్యర్థి నానా కాటే పై సుమారు 3,300 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇక్కడ బరిలో ఉన్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థి రాహుల్ కలాటే 7,901 ఓట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ అభ్యర్థుల మరణం కారణంగా ఈ స్థానాల్లో ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరిగాయి.

02 March 2023, 13:44 IST

నాగాలాండ్​కు తొలి మహిళా ఎమ్మెల్యే..

60ఏళ్ల నాగాలాండ్​ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో దిమాపూర్​-3 సీటు నుంచి పోటీచేసిన ఎన్​డీపీపీ అభ్యర్థి హెకానీ జకాలు.. విజయం సాధించారు.

02 March 2023, 13:08 IST

త్రిపురలో బీజేపీ ఆధిక్యం..

త్రిపురలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. నాగాలాండ్​లో ఎన్​డీపీపీ- బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఇక మేఘాలయలో ఎన్​పీపీ.. అతిపెద్ద పార్టీగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి.

02 March 2023, 12:01 IST

మధ్యాహ్నం 12 గంటల వరకు..

మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న ట్రెండ్స్​ ప్రకారం..
త్రిపురలో బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వామపక్షాలు- కాంగ్రెస్​ కూటమి 12 చోట్ల ముందంజలో ఉంది.

మేఘాలయలో ఎన్​పీపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ కేవలం 4 సీట్లల్లోనే ముందుంది. టీఎంసీ 7 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంది.

నాగాలాండ్​లో ఎన్​డీపీపీ- బీజేపీ కూటమి 37 సీట్లల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

02 March 2023, 11:32 IST

తమిళనాడు ఉప సమరంలో..

తమిళనాడు కాంగ్రెస్​ శ్రేణుల్లో సందడి నెలకొంది. ఈరోడ్​ బై ఎలక్షన్​లో పార్టీ అభ్యర్థి ఈవీకేఎస్​ ఎలంగోవన్​.. 10వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

02 March 2023, 10:36 IST

మేఘాలయలో పరిస్థితి ఇలా..

ఈసీ అధికారిక ట్రెండ్స్​ ప్రకారం.. ఎన్​పీపీ 17 స్థానాల్లో లీడ్​లో ఉంది. టీఎంసీ 5, బీజేపీ 4 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మొత్తం 59 సీట్లకు ఓటింగ్​ జరగ్గా.. ప్రస్తుతం 49 చోట్ల లీడ్స్​ బయటకొచ్చాయి.

02 March 2023, 10:10 IST

త్రిపురలో బీజేపీ హవా

త్రిపురలో పోస్ట్​ బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు మధ్య అధికార బీజేపీ 39 సీట్లల్లో ముందంజలో ఉంది. వామమపక్షాలు- కాంగ్రెస్​ కూటమి 15 సీట్లల్లో ముందుంది. టిప్రా పార్టీ కేవలం 5 సీట్లల్లోనే అధిక్యంలో కొనసాగుతోంది.

02 March 2023, 9:18 IST

బీజేపీ జోరు..

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. త్రిపుర, నాగాలండ్​లో ఇతర పార్టీల కన్నా బీజేపీకి అధిక్యం చాలా ఎక్కువగా ఉంది! మేఘాలయలో మాత్రం ఎన్​పీపీ ముందుంది.

02 March 2023, 8:59 IST

నాగాలాండ్​లో

నాగాలాండ్​లో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. బీజేపీ 46 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎన్​పీఎఫ్​ 6, కాంగ్రెస్​ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

02 March 2023, 8:30 IST

మేఘాలయలో

ఎర్లీ ట్రెండ్స్​ ప్రకారం.. మేఘాలయలో బీజేపీ 10 స్థానాల్లో లీడ్​లో ఉంది. కాంగ్రెస్​ 4, ఎన్​పీపీ 28 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 10 సీట్లల్లో ముందున్నారు.

02 March 2023, 8:30 IST

లీడ్​లో బీజేపీ..

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. త్రిపురలో 25 సీట్లల్లో బీజేపీ లీడ్​లో ఉంది. వామపక్షాలు 15, టిప్రా పార్టీ 14 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

02 March 2023, 8:06 IST

ఓట్ల లెక్కింపు షురూ..

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. కౌంటింగ్​ కేంద్రాల వద్ద హడావుడి నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.

02 March 2023, 7:44 IST

కౌంటింగ్​ కోసం..

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఈవీఎం మెషిన్​లను సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసింది.

02 March 2023, 7:26 IST

ఉప సమరం..

3 రాష్ట్రాల ఎన్నికలతో పాటు పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఆయా ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి.

02 March 2023, 7:15 IST

త్రిపుర.. మేఘాలయ.. నాగాలాండ్​..

త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్​ జరిగింది. మేఘాలయ, నాగాలాండ్​లో మంగళవారంతో ఓటింగ్​ ప్రక్రియ ముగిసింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60, 60, 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఎగ్జిట్​ పోల్స్​ ప్రకారం.. త్రిపురలో బీజేపీ జెండా మరోసారి ఎగురుతుంది. నాగాలాండ్​లో ఎన్​డీపీపీ- బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. మేఘాలయలో మాత్రం హంగ్​ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

02 March 2023, 7:13 IST

8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ..

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​లో ఎన్నికల హడావుడికి నేటితో ముగింపు పడనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

    ఆర్టికల్ షేర్ చేయండి