Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాలు మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే!
27 October 2023, 11:08 IST
- Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానే ఇందుకు ప్రధాన కారణం.
ఈశాన్య రుతుపవనాలు మరింత ఆలస్యం..
Northeast Monsoon : సాధారణంగా అక్టోబర్ మధ్య వారంలో దేశంలోకి ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు.. ఈసారి ఆలస్యమయ్యాయి. అక్టోబర్ నెల ముగింపు దశకు చేరుకుంటున్నా.. ఇంకా రుతుపవనాల జాడ కనిపించడం లేదు. కాగా.. బంగాళాఖాతంలో ఇటీవలే ఏర్పడిన హమూన్తు పాను.. ఇందుకు కారణం అని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఈశాన్య రుతుపవనాలు..
నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా.. ప్రతి యేటా జూన్ మొదటి వారానికి అటు, ఇటుగా కేరళను తాకుతాయి. ఆ తర్వాత దేశాన్ని చుట్టి అక్టోబర్ మొదటి వారం నాటికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత.. అక్టోబర్ 20కి అటు, ఇటుగా ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, రాయలసీమ, మధ్య కర్ణాటక, కేరళను ఈ రుతుపవనాలు ప్రభావితం చేస్తాయి. తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయి.
Northeast Monsoon in India : కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను కారణంగా.. ఈసారి ఈశాన్య రుతుపవనాలు ఆలస్యమయ్యాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది.
"సాధారణంగా.. ఈ సమయంలో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడదు. కానీ ఈసారి అలా జరిగింది. అందుకే.. అక్టోబర్ 20కి అటు, ఇటుగా దేశంలోకి ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు.. ఆలస్యమయ్యాయి. రుతుపవనాలు ఇంకాస్త ఆలస్యం అవ్వొచ్చు," అని స్కైమెట్.. గురువారం తెలిపింది.
ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావం తొలుత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుంది. అక్టోబర్ చివరి నాటికి ఈ రెండు చోట్ల భారీ వర్షాలు పడుతున్నట్టు కనిపిస్తే.. ఈశాన్య రుతుపవనాలు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినట్టే.
Northeast Monsoon time : ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో.. స్కైమెట్ అధికారులు రుతుపవనాలను నిరంతరం ట్రాక్ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.
భారత వాతావరణశాఖ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కనిపిస్తే.. ఆలస్యమైన ఈశాన్య రుతుపవనాలు, ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినట్టు భావించవచ్చని పేర్కొంది.
ఈ ఏడాది.. సాధారణం కన్నా తక్కువే!
8ఏళ్లల్లో తొలిసారిగా.. ఈ ఏడాది.. ఇండియాలో వర్షపాతం, సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 6 మధ్య ఉన్న నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో 11శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
TS winter updates : తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. పది రోజుల క్రితం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా మూడు నాలుగు రోజులుగా చలి వణికిస్తోంది. చలితీవ్రత నేపథ్యంలో ఉదయాన్నే లేవడానికి జనాలు భయపడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.