TS Rains : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు!-telangana weather next three days moderate rains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rains : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు!

TS Rains : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు!

Bandaru Satyaprasad HT Telugu
Oct 01, 2023 10:30 PM IST

TS Rains : తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

 తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు (HT Photo)

TS Rains : తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని తెలిపింది. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు మేఘాలు విస్తరించాయని పేర్కొంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం రావడంతో, ఉపసంహరణ కూడా ఆలస్యమవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గతేడాది కూడా రుతుపవనాల ఉపసంహరణ సైతం రెండు వారాలు ఆలస్యమైందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

అధిక వర్షపాతం

తెలంగాణలో సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 4 నెలల పాటు సాధారణం కంటే 15 శాతం అధికంగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్‌ మూడో వారం తర్వాత నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రుతుపవనాల కారణంతో మెదక్‌, నిజామాబాద్‌, వరంగల్‌, సంగారెడ్డి సహా 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇతర జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిధిలో సాధారణ వర్షపాతం 616.5 మిల్లీమీటర్లు కాగా 775.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైదందని తెలుస్తోంది.

Whats_app_banner