Hamoon Cyclone : అతి తీవ్ర తుపానుగా హమూన్, రేపు బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం
Hamoon Cyclone : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను అతి తీవ్రమైన తుపానుగా మారింది. ఈశాన్య మార్గంలో కదులుతున్న తుపాను రేపు సాయంత్రం బంగ్లాదేశ్ లో ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటనుంది.
Hamoon Cyclone : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను అతి తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సైక్లోనిక్ తుపానుకు ఇరాన్ 'హమూన్' అని పేరు పెట్టింది. 'హమూన్' అనే పదం పర్షియన్ పదం, ఇది లోతట్టు ఎడారి సరస్సులు లేదా చిత్తడి నేలలను సూచిస్తుంది. అవి హెల్మండ్ బేసిన్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సహజ కాలానుగుణంగా జలాశయాలుగా ఏర్పడతాయి. హమూన్ సైక్లోన్ రాబోయే 6 గంటల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత, ఈశాన్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుందన్నారు. 65-75 కి.మీ వేగంతో అక్టోబర్ 25వ తేదీ సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రైతులకు అలర్ట్
తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీహెచ్చరించింది. తుపాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్నందున... ముందే పంట కోతలు పూర్తి చేయాలని భారత వాతావరణ శాఖ రైతులకు సూచించింది. అలాగే తమ పంటలను సురక్షిత ప్రదేశంలో ఉంచుకోవాలని తెలిపింది. "ఇది వరి కోత సమయం, కాబట్టి కోతలు చేసే వారు త్వరగా పూర్తి చేసి సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని సూచించారు" అని ఐఎండీ, భువనేశ్వర్ లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త ఉమా శంకర్ దాస్ తెలిపారు.
బంగ్లాదేశ్ లో తీరం దాటనున్న తుపాను
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘హమూన్’ తీవ్ర తుపానుగా మారి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్ లోని ఏడు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, అసోం, మేఘాలయ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో హమూన్ సైక్లోన్ ఈశాన్యం దిశగా కదులుతోందని, 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిందని ప్రకటించింది. ఒడిశా పారాదీప్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ అధికారులు వివరించారు. తుపాను ప్రభావంతో బెంగాల్ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఏపీపై ఎఫెక్ట్
హమూన్ తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.