Narendra Modi: రాష్ట్రపతిని కలిసిన మోదీ; జూన్ 9న ప్రమాణ స్వీకాారానికి ముహూర్తం
07 June 2024, 19:55 IST
Narendra Modi: ఎన్డీయే సమావేశం అనంతరం, ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమెకు వివరించి, ఎన్డీయే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నరేంద్ర మోదీ
Narendra Modi: ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్డీయే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్ము నరేంద్ర మోదీని కోరారు.
జూన్ 9న ముహూర్తం
నరేంద్ర మోదీ జూన్ 9వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాధించిన ఘనతను సమం చేస్తూ 73 ఏళ్ల మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడోసారి ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చారని రాష్ట్రపతిని కలిసిన అనంతరం మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గత రెండు దఫాలుగా దేశం ఎంత వేగంగా ముందుకు సాగిందో, అంతకుమించిన వేగంతో ప్రగతి సాధిస్తామన్నారు. ఈ 10 ఏళ్లలో ప్రతి రంగంలోనూ సానుకూల మార్పు కనిపిస్తోందని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.
ఎన్డీయే సంపూర్ణ మద్ధతు
అంతకుముందు, పార్లమెంటు సెంట్రల్ హాల్ లో జరిగిన సమావేశంలో ఎన్డీయే సభ్య పార్టీలు నరేంద్ర మోదీని కూటమి పార్లమెంటరీ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ప్రధానిగా తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మోదీని కోరాయి. బీజేపీ నేత రాజ్ నాథ్ సింగ్ చేసిన ఈ ప్రతిపాదనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నితీష్ కుమార్, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్ డి కుమారస్వామి తదితరులు మద్ధతిచ్చారు. ‘‘రానున్న దేశాభివృద్ధి కోసం మరింత కష్టపడి, వేగంగా పనిచేస్తాం’’ అని మోదీ అన్నారు.
ఓడిపోలేదు..
"ఈ విజయాన్ని గుర్తించకుండా, ఈ విజయంపై 'ఓటమి నీడ' వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు’’ అని ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ వ్యాఖ్యానించారు. ’’ఈ రోజు భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారు. అదే నరేంద్ర మోదీ. భారత్ కు ఇదొక మంచి అవకాశం. ఇప్పుడు మిస్ అయితే ఎప్పటికీ మిస్సవుతారు.’’ అని సంకీర్ణ నేతగా మోదీని సమర్థిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మోదీ భారతదేశాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకు ఉందని, ఆయనకు మనస్ఫూర్తిగా మద్దతిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.