తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: ‘‘అలా చేసి ఉంటే.. వారణాసిలో మోదీని ఓడించేవాళ్లం’’ - రాహుల్ గాంధీ

Rahul Gandhi: ‘‘అలా చేసి ఉంటే.. వారణాసిలో మోదీని ఓడించేవాళ్లం’’ - రాహుల్ గాంధీ

HT Telugu Desk HT Telugu

12 June 2024, 18:41 IST

google News
  • లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీని పోటీకి నిలిపి ఉంటే, మోదీని కచ్చితంగా ఓడించగలిగేవాళ్లమని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

కేరళలో రాహుల్ గాంధీ
కేరళలో రాహుల్ గాంధీ (PTI file photo)

కేరళలో రాహుల్ గాంధీ

Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాలు సాధించిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని మళప్పురంలో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఓటమి నుంచి తృటిలో తప్పించుకున్నారని వ్యాఖ్యానించారు.

ప్రియాంక పోటీ చేసి ఉంటే..

వారణాసిలో నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ తరఫున తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే.. మోదీ కచ్చితంగా ఓడిపోయి ఉండేవారని రాహుల్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో కూడా బీజేపీ ఓటమి పాలైన విషయాన్ని గుర్తు చేస్తూ.. విద్వేషాన్ని, హింసను తాము హర్షించబోమని అయోధ్య ప్రజలు సందేశం ఇచ్చారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, రాజ్యాంగాన్ని మారుస్తామని ఎన్నికల ముందు ప్రధాని మాట్లాడేవారని, కానీ ఇప్పుడు ఆయనే దానిని పూజించాల్సి వస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. వారణాసిలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై 150,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రధాని మోదీకి 6,12,970 ఓట్లు పోలయ్యాయి. అజయ్ రాయ్ కు 460457 ఓట్లు వచ్చాయి.

అయోధ్యలో ఎస్పీ గెలుపు

అయోధ్యలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ విజయం సాధించారు. యూపీలో కాంగ్రెస్ ఆరు సీట్లు గెల్చుకుంది. మొత్తంగా ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెల్చుకుని, సెంచరీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. మొత్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 సీట్లు గెల్చుకుంది. గత ఎన్నికల్లో 300 సీట్లు దాటిన బీజేపీ ఈ ఎన్నికల్లో 240 సీట్లకు పరిమితమైంది. ఇది పార్లమెంటు దిగువ సభలో సాధారణ మెజారిటీ అయిన 272 కు 32 సీట్లు తక్కువ. దాంతో, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన మిత్రపక్షాల నేతలైన చంద్రబాబు, నితీశ్ కుమార్, ఏక్ నాథ్ షిండేలపై ఆధారపడాల్సి వచ్చింది.

మోదీ నైతిక ఓటమి

ఎన్నికల తర్వాత సీట్లు కోల్పోవడం నరేంద్ర మోదీకి నైతిక ఓటమి అని కాంగ్రెస్ పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, బీజేపీకి కంచుకోట లాంటి ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ మిత్రపక్షం సమాజ్ వాదీ పార్టీ ఏకంగా 37 లోక్ సభ స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 33 స్థానాల్లో విజయం సాధించింది.

తదుపరి వ్యాసం