Heavy rains : నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్- స్కూళ్లకు సెలవు!
04 July 2023, 10:58 IST
IMD Heavy rain alert : ఐఎండీ ప్రకారం.. నేడు అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.
నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్- స్కూళ్లకు సెలవు!
IMD Heavy rain alert : దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ (భారత వాతావరణశాఖ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. కేరళ, కర్ణాటక తీర- దక్షిణ ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇక్కడ స్కూళ్లకు సెలవు.. అక్కడ రెడ్ అలర్ట్..!
కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఇప్పుడు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటకలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళూరు, ముల్కి, ఉల్లాల్, మూద్బిద్రి, బాంత్వాల్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవును ప్రకటించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు.
మరోవైపు కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణశాఖ. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కన్నూర్, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ అందగా.. పథనమ్‌తిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కసర్గోడ్ జిల్లాలు ఆరెంజ్ అలర్ట్‌లో ఉన్నాయి. తిరువనంతపురం, కొల్లం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యింది.
ఇదీ చూడండి:- AP TS Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్, రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు
ఇతర ప్రాంతాల్లో ఇలా..
Heavy rains in Karnataka : దిల్లీలో వాతావరణం చల్లగా మారింది. మంగళవారం ఇక్కడ తేలికపాటి వర్షం కురుస్తుందని ఐఎండీ వెల్లడించింది. ఇక ఒడిశాలో జులై 3 నుంచి 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వెల్లడించింది వాతావరణశాఖ. ఈ నేపథ్యంలో 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సుందర్‌గఢ్, మయూర్బంజ్, సోనిపుర్, బౌధ్, బలాన్గిర్ వంటి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందిని హెచ్చరించింది.
కోంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు, గుజరాత్లో 6,7 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. పశ్చిమ్ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతం, సిక్కిం, అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లో నాలుగు రోజుల పాటు జోరుగా వానలు పడతాయి. మేఘాలయలో మాత్రం మంగళవారం అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఝర్ఖండ్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో గురువారం వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది.