Places To Visit In Goa । గోవాలో కచ్చితంగా చూడాల్సిన ఉత్తమ ప్రదేశాలు ఇవే!-top 10 best places to visit in goa tour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Places To Visit In Goa । గోవాలో కచ్చితంగా చూడాల్సిన ఉత్తమ ప్రదేశాలు ఇవే!

Places To Visit In Goa । గోవాలో కచ్చితంగా చూడాల్సిన ఉత్తమ ప్రదేశాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Apr 28, 2023 07:11 PM IST

Places To Visit In Goa: మీరు గోవా సందర్శించాలనుకుంటే గోవాలో చూడదగ్గ ప్రదేశాలు, మీ జాబితాలో ఉండవలసిన ఉత్తమ స్థలాలను ఇక్కడ తెలుసుకోండి.

Dudhsagar Falls- Goa
Dudhsagar Falls- Goa (Stock Pic)

Goa Places: విహారయాత్ర వినోదాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకునే గోవా యాత్రికులకు గోవా స్వర్గధామం. ఈ అందమైన చిన్న రాష్ట్రంలో అద్భుతమైన బీచ్‌లు మాత్రమే కాదు, పాలు కుమ్మరించినట్లుగా పారే జలపాతాలు, మనోహరమైన గ్రామాలు, గొప్ప చరిత్రాక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. గోవాలో ఉండే విభిన్న సంస్కృతులు అక్కడి వెళ్లే వారందరికీ ఏదో ఒక రూపంలో ఈ ప్రదేశం కూడా తమదే అన్న భావనను కలిగిస్తుంది. ఈ తీర ప్రాంత స్వర్గంలో చూడడానికి, అనుభవించడానికి చాలా ఉన్నాయి.

ఈసారి మీరు గోవా సందర్శించాలనుకుంటే మీ జాబితాలో ఉండవలసిన ఉత్తమ స్థలాలను ఇక్కడ తెలుసుకోండి. ఈ సమాచారం మీరు గోవా వెళ్లాక ఏదో ఒక చోటకే పరిమితం కాకుండా మొత్తం గోవా చుట్టుపక్కల ఏమేం ఉన్నాయో మీకు ఒక అవగాహన కలిగిస్తుంది.

కలంగుట్ బీచ్: కలాంగుట్ బీచ్ గోవాలో అత్యంత ప్రసిద్ధమైన బీచ్. పారదర్శకమైన సముద్ర జలాలు, అంతులేని వినోదాలను పంచే వాటర్ స్పోర్ట్స్, ఉత్కంఠభరితమైన దృశ్యాలకు ఈ బీచ్ ప్రసిద్ధి. సూర్యోదయం, సూర్యాస్తమయాల అద్భుత వీక్షణలను ఆస్వాదించటానికి కూడా ఇది అనువైన ప్రదేశం.

పాత గోవా: ఓల్డ్ గోవా గొప్ప చరిత్ర, అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి. ఒకప్పటి గోవా వారసత్వ సంపదను వర్ణించే అద్భుత ప్రదేశం ఇది. ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ చర్చిలు, పురాతన మ్యూజియంలు ఈ ప్రదేశంలో ఉన్నాయి.

ఫోర్ట్ అగ్వాడా: ఫోర్ట్ అగ్వాడా అనేది సింక్వెరిమ్ బీచ్‌లోని 17వ శతాబ్దపు కోట, ఇది పోర్చుగీస్ ఆక్రమణదారులను గోవాలోకి చొరబడకుండా అడ్డుకునే రక్షణ కేంద్రంగా పనిచేసింది. నేడు ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది. మంత్రముగ్దులను చేసే సూర్యాస్తమయ వీక్షణను ఆస్వాదించడానికి సరైన ప్రదేశం.

దూద్‌సాగర్ జలపాతాలు: దూద్‌సాగర్ జలపాతాలు నాలుగు అంచెల జలపాతం, ఇది 320 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నుండి కిందకు దూకుతూ ప్రవహిస్తుంది. ఈ జలపాతం చుట్టూ ఉన్న పచ్చని అడవులు కనువిందు చేస్తాయి. వర్షాకాలంలో అయితే ఈ ప్రదేశంలోని ప్రకృతి సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే.

పనాజీ సిటీ: పనాజీ నగరం గోవా రాజధాని. భారతీయ, పోర్చుగీస్ సంస్కృతుల ప్రత్యేక సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం మీకు కచ్చితంగా ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రదేశం ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చి, మేరీ ఇమ్మాక్యులేట్ చర్చి వంటి అనేక ప్రముఖ ల్యాండ్‌మార్క్‌లకు నిలయం.

అంజునా ఫ్లీ మార్కెట్: అంజునా ఫ్లీ మార్కెట్ దుకాణదారులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఇది చేతితో తయారు చేసిన సావనీర్‌ల మొదలుకొని బట్టలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వరకు అన్నింటినీ విక్రయించే ప్రసిద్ధ వీధి మార్కెట్.

మోర్జిమ్ బీచ్: మోర్జిమ్ బీచ్ ఒక నిర్మలమైన, ప్రశాంతమైన బీచ్. స్వచ్ఛమైన నీరు, మృదువైన ఇసుక, ప్రశాంతమైన పరిసరాలకు ప్రసిద్ధి చెందింది. ఇది అంతరించిపోతున్న అనేక జాతుల తాబేళ్లు గూడు కట్టుకునే ప్రదేశం. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం సరైన గమ్యస్థానం.

చపోరా కోట: చపోరా కోట అనేది అద్భుతమైన వాగేటర్ బీచ్‌ని చూసే ఒక సుందరమైన కోట. కోట దాని ప్రత్యేక నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఫోటో షూట్లు చేసుకోవడానికి కూడా ఇది అనువైన ప్రదేశం.

సే కేథడ్రల్: సే కేథడ్రల్ ఆసియాలోని అతిపెద్ద చర్చిలలో ఒకటి. ఈ చర్చి అద్భుతమైన పోర్చుగీస్ వాస్తుకళను తెలియజేస్తుంది. మనసును కదిలించె అనేకమైన సున్నితమైన పెయింటింగ్‌లు, అద్భుతమైన శిల్పాలకు నిలయంగా ఉంది.

పురాతన శివాలయం: గోవాకు దక్షిణాన కర్ణాటక సరిహద్దులో పురాతన శివాలయం ఉంది. పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ మహాదేవ ఆలయం 12వ శతాబ్దం నాటిది, ఆలయం చుట్టూ పర్వతాల, అడవి సుందరమైన దృశ్యాలు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం