Live news today : ‘మణిపూర్’పై చర్చకు విపక్షాల పట్టు.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
21 July 2023, 21:14 IST
- Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ వార్తల కోసం ఈ హెచ్‌టీ తెలుగు లైవ్ అప్డేట్స్ను ఫాలో అవ్వండి..
Q1 లో రిలయన్స్ లాభాలు రూ. 16,011 కోట్లు; 10 శాతం క్షీణత
Reliance Q1 Results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) శుక్రవారం ప్రకటించింది. Q1FY24 లో రిలయన్స్ నికర లాభాల్లో 10.8% క్షీణత నమోదైంది. Q1FY24 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభాలు రూ. 16,011 కోట్లు. కాగా, Q1FY23 లో అది రూ. 17,955 కోట్లు.
12 శాతం పెరిగిన రిలయన్స్ ‘జియో’ లాభాలు; Q1 లో జియో నికర లాభాలు రూ. 4863 కోట్లు.
రిలయన్స్ జియో (Reliance Jio) నికర లాభాల్లో 12% వృద్ధి నమోదైంది. Q1FY24 లో భారతీయ టెలీకాం దిగ్గజం జియో రూ. 4,863 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY23) లో జియో సాధించిన నికర లాభాలు రూ. 4,335 కోట్లు. Q1FY23 తో పోలిస్తే Q1FY24 లో జియో ఆదాయంలో కూడా 10% వృద్ధి నమోదైంది. Q1FY24 లో జియో ఆదాయం రూ. 24, 042 కోట్లు కాగా, Q1FY23 లో రూ. 21,873 కోట్లు.
ప్రేమించిందని చెల్లి తల నరికిన అన్న; ఆ తలతో ఊరంతా తిరిగిన ఉన్మాది
ఉత్తర ప్రదేశ్ లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి సొంత చెల్లినే తల నరికి చంపేసాడో ఉన్మాది. అంతేకాదు, ఆ తలను చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగాడు. అతడిని చూసి ఊరంతా భయాందోళనలతో వణికిపోయింది.
బాలికపై లైంగిక వేధింపులు; పాస్టర్ అరెస్ట్
Pastor sexually assaults minor girl: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన చర్చ్ ప్రీస్ట్ ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్నాటకలోని శివమొగ్గలో జరిగింది. శివమొగ్గలో ఒక కాలేజీకి అనుబంధంగా ఉన్న చర్చ్ లో ఆ పాస్టర్ మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ రోజు నుంచి నథింగ్ ఫోన్ 2 సేల్ ప్రారంభం; బెస్ట్ ప్రైస్ కు ప్రీమియం స్మార్ట్ ఫోన్; లాంచ్ ఆఫర్ కూడా
అంతర్జాతీయంగా ఈ నథింగ్ ఫోన్ 2 ని పది రోజుల క్రితం లాంచ్ చేశారు. తాజాగా, జులై 21 న తొలిసారి భారత్ లో సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఈ Nothing Phone 2 పలు లాంచ్ ఆఫర్స్ తో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్స్ ట్రాన్స్ పరెంట్ బ్యాక్ డిజైన్ చాలా మందిని ఆకర్షించింది. నథింగ్ ఫోన్ 1 సేల్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఫోన్స్ అన్నీ అమ్ముడుపోయాయి. దాంతో, నథింగ్ ఫోన్ 2 కు కూడా భారీ రస్పాన్స్ ను ఆశిస్తున్నారు.
కైలాస పర్వతానికి భారత్ నుంచి కొత్త మార్గం; త్వరలో ప్రారంభం
మహాదేవుడి నివాసంగా భక్తులు విశ్వసించే కైలాస పర్వతానికి భారత్ వైపు నుంచి ఒక మార్గాన్ని నిర్మిస్తున్నారు. భారత సైన్యానికి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఈ డైమండ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. వాతావరణం అనుకూలిస్తే, ఈ సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తవుతుందని, అప్పటి నుంచి భారత్ నుంచి భక్తులు, పర్యాటకులు పవిత్ర కైలాస పర్వతానికి వెళ్లవచ్చని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ విమల్ గోస్వామి వెల్లడించారు. ఉత్తరాఖండ్ లోని పితోడ్ గఢ్ జిల్లాలో ఉన్న నభిధాంగ్ కేఎంవీఎన్ హట్స్ నుంచి సుమారు 7 కిమీల దూరంలోని భారత, చైనా సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ పాస్ వరకు ఈ రోడ్డు నిర్మాణం ఉంటుంది. కఠినమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల మధ్య ఈ నిర్మాణం సాగుతోంది.
ముంబైలో వర్షాలు..
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైలో ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. ఫలితంగా అనేక రోడ్లు జలమయం అయ్యాయి.
బులెట్ 350 వచ్చేస్తోంది..
2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 కోసం బైక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ చెప్పింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ ఏడాది ఆగస్టు 30న ఈ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం 2వ పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది.
శ్రీలంకలో యూపీఐ..
శ్రీలంకలో యూపీఐ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆదేశాధ్యక్షుడు విక్రమ్‌సింఘే, ప్రధాని మోదీ మధ్య ఒప్పదం కుదిరింది.
లోక్‌సభ వాయిదా
1 గంట వాయిదా తర్వాత 12 గంటలకు సమావేశమైన లోక్‌సభ.. ఈసారి ఏకంగా సోమవారం ఉదయం వరకు వాయిదా పడింది.
శ్రీలంక అధ్యక్షుడి పర్యటన..
భారత్ పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. పలు కీలక అంశాలపై వారిద్దరు చర్చించారు.
లోక్‌సభ వాయిదా..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన లోక్‌సభ.. కొంత సేపటికే వాయిదా పడింది. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
సుప్రీంకోర్టు విచారణ
రాహుల్ గాంధీ కేసుపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. మోదీ ఇంటి పేరు వివాదంలో తనకు విధించిన శిక్షపై ఉపశమనాన్ని కల్పించాలని ఆయన ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆగస్టు 1 నుంచి గురుకుల నియామక పరీక్షలు
గురుకుల ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ ఇచ్చింది రిక్రూట్ మెంట్ బోర్డు. ఆగస్టు 1వ తేదీ నుంచి నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 24 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్‌లో వర్షాలు..
హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం వర్షం కురుస్తోంది. అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధనిక ఎమ్మెల్యే…
దేశంలో ఉన్న ధనిక ఎమ్మెల్యేల జాబితాకు సంబంధించిన రిపోర్టును తాజాగా విడుదల చేసింది ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్). ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత, ప్రస్తుత ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు!
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 640 పాయింట్లు కోల్పోయి 66,932 వద్ద ఓపెన్ అయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 179 పాయింట్లు కోల్పోయి 19,800 వద్ద ప్రారంభమైంది.
వెస్టిండీస్‌తో రెండో టెస్టు
ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో గురువారం, జూలై 20న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మెుదలైంది. భారత్ భారీ స్కోరు దిశగా వెళ్తోంది. రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసేసరికి మంచి స్కోరు సాధించింది
ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్
ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. శాన్ డియాగోలో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్‌లో ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
మణిపూర్‌లో కూడా..
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో కూడా శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉక్రుల్ అనే ప్రాంతంలో 5:01 గంటలకు 3.5 తీవ్రతతో భూమి కంపించింది.
జైపూర్‌లో భూకంపాలు..
వరుస భూకంపాలతో రాజస్థాన్ జైపూర్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో అరగంట వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.47శాతం మేర లాభపడింది. ఎస్ అండ్పీ 500 0.68శాతం నష్టపోయింది. కాగా.. టెక్ ఇండెక్స్ నాస్డాక్.. ఏకంగా 2.05శాతం నష్టపోయింది.
స్టాక్ మార్కెట్ ఓపెనింగ్..
దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.