Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలోనే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇంటెరిం రిలీఫ్ [IR] కూడా ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం [EHS] పై కూడా నిర్ణయం తీసుకోవటంతో పాటు... ఈహెచ్ఎస్ అమలుకు విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌజింగ్ పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన ఇచ్చే ఛాన్స్ ఉందని... వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది.
గురువారం పలువురు ఉద్యోగ సంఘ నేతలు కూడా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారని సమాచారం. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ను ప్రకటించాలని ఉద్యోగ సంఘ నేతలు కేటీఆర్ ను కోరారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోనే అంశంతో పాటు 317 జీవోతో తలెత్తిన ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న కారుణ్య నియమకాల అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీటిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్… పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతిని( ఐఆర్) ముఖ్యమంత్రి త్వరలోనే ప్రకటిస్తారని వారితో చెప్పినట్లు తెలుస్తోంది.