USA News: అమెరికా అధ్యక్ష రేసులో గెలిచేదెవరంటే..!: 'ప్రిడిక్షన్ ప్రొఫెసర్' అంచనా ఇదే..
30 July 2024, 15:23 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలో ఈ ప్రిడిక్షన్ ప్రొఫెసర్ అంచనాపై అందరూ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, 1984 నుంచి ఆయన అంచనాలు తప్పలేదు. 2016 లో ట్రంప్ గెలుస్తారని, 2020 లో జో బైడెన్ గెలుస్తారని ఈ ప్రిడిక్షన్ ప్రొఫెసర్ బల్ల గుద్ది మరీ చెప్పారు. తాజాగా, 2024 ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పేశారు.
అమెరికా తదుపరి అధ్యక్షుడి పేరు చెప్పిన 'ప్రిడిక్షన్ ప్రొఫెసర్'
Next US president: 1984 నుంచి దాదాపు ప్రతి అధ్యక్ష ఎన్నికలను కచ్చితంగా అంచనా వేసిన 'ప్రిడిక్షన్ ప్రొఫెసర్' అలియాస్ అలెన్ లిచ్ మన్.. తాజాగా 2024 ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పారు. తన ‘కీస్ టు ది వైట్ హౌజ్’ ఫార్మూలాతో శాస్త్రీయ పద్ధతిలో ఈ అంచనా వెలువరిస్తానని అలెన్ లిచ్ మన్ తెలిపారు.
మన కమల హారిస్ దే విజయం..
అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) 2024 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తారని 'ప్రిడిక్షన్ ప్రొఫెసర్' అలియాస్ అలెన్ లిచ్ మన్ జోస్యం చెప్పారు. 2016లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయాన్ని, 2020లో జో బైడెన్ గెలుపును సరిగ్గా అంచనా వేసిన లిచ్ మన్.. తాను అభివృద్ధి చేసిన 'కీస్ టు ది వైట్హౌస్' అనే ఫార్ములా ఆధారంగా ఈ అంచనాలను రూపొందించారు.
'వైట్ హౌస్ కీస్' అంటే ఏమిటి?
'కీస్ టు ది వైట్ హౌస్'లో అభ్యర్థుల బలాలు, బలహీనతలను అంచనా వేసేందుకు రూపొందించిన 13 ‘ట్రూ ఆర్ ఫాల్స్ (true-or-false)’ ప్రశ్నలు ఉంటాయి. ఒక అభ్యర్థి ఆరు లేదా అంతకంటే ఎక్కువ "కీలు" పొందినట్లయితే, ఆ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధిస్తారని లిచ్ మన్ నిర్ధారించారు.
ఇవే ఆ 'కీస్ టు ది వైట్ హౌస్'
అధ్యక్ష రేసులో విజయం సాధించే వ్యక్తిని నిర్ధారించేందుకు లిచ్ మన్ ఈ కింద పేర్కొన్న 'కీస్ టు ది వైట్ హౌస్' ను పరిగణనలోకి తీసుకుంటారు. అవి..
- Party mandate
- Contest
- Incumbency
- Third party
- Short-term economy
- Long-term economy
- Policy change
- Social unrest
- Scandal
- Foreign/military failure
- Foreign/military success
- Incumbent charisma
- Challenger charisma
కమలా హారిస్ ముందంజ
2024 ఎన్నికల సంవత్సరం ప్రారంభంలో, అధ్యక్షుడు బైడెన్ పాలన కారణంగా డెమోక్రాట్లకు పైన పేర్కొన్న 13 ‘కీ’ లలో ఒక "కీ" లభించింది. అయితే, ఆ తరువాత రాజకీయంగా చాలా మార్పులు వచ్చాయి. లిచ్ మన్ తాజా అంచనా ప్రకారం చూస్తే, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కమలా హారిస్ ప్రస్తుతం పదమూడు ‘కీ’ లలో ఆరు కీలను కలిగి ఉన్నారు. అవి ప్రాధమిక పోటీ (Contest), స్వల్పకాలిక ఆర్థిక వ్యవస్థ (Short-term economy), దీర్ఘకాలిక ఆర్థిక వ్యవస్థ (Long-term economy), విధాన మార్పు (Policy change), కుంభకోణాలు లేవు (Scandal), ఛాలెంజర్ చరిష్మా లేదు (Challenger charisma)’ అనే ఆరు ‘కీ’ లను కమల కలగి ఉన్నారు.
చాలా తప్పులు చేస్తేనే ఓటమి..
ఈ ఎన్నికల్లో కమల హారిస్ విజయం ఖాయమని ప్రిడిక్షన్ ప్రొఫెసర్ అలెన్ లిచ్ మన్ గట్టిగా చెబుతున్నారు. హారిస్ ఓడిపోవాలంటే ఆమె, డెమొక్రాట్ ప్రచార టీమ్ చాలా తప్పులు చేయాల్సి ఉంటుందని లిచ్ మన్ వ్యాఖ్యానించారు. డెమొక్రాట్లు మరో మూడు కీలను కోల్పోతే ఓడిపోతారని లిచ్ మన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి మూడు ‘కీ’ లను మాత్రమే కలిగి ఉన్నారు. అవి 2022 మధ్యంతర ఎన్నికలలో హౌస్ మెజారిటీని గెలుచుకోవడం, ప్రస్తుత అధికారంలో ఉన్న వ్యక్తి తిరిగి ఎన్నికను కోరుకోకపోవడం మరియు ప్రస్తుత పదవిలో ఉన్న వ్యక్తికి చరిష్మా లేకపోవడం’ అనేవే ఆ మూడు ‘కీ’లు.