White House: వైట్ హౌస్ వద్ద ట్రక్కుతో తెలుగు సంతతి యువకుడి బీభత్సం.. “అందుకోసం.. అవసరమైతే బైడెన్‍ను చంపేస్తా”-indian origin teen crashes into white house barriers wanted to kill us president reports ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indian Origin Teen Crashes Into White House Barriers Wanted To Kill Us President Reports

White House: వైట్ హౌస్ వద్ద ట్రక్కుతో తెలుగు సంతతి యువకుడి బీభత్సం.. “అందుకోసం.. అవసరమైతే బైడెన్‍ను చంపేస్తా”

Chatakonda Krishna Prakash HT Telugu
May 24, 2023 10:43 AM IST

White House: వైట్ హౌస్ దగ్గర తెలుగు సంతతికి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ట్రక్కుతో హంగామా చేశాడు. బారియర్లను ఢీకొట్టాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

White House: వైట్ హౌస్ వద్ద ట్రక్కుతో తెలుగు సంతతి యువకుడి బీభత్సం
White House: వైట్ హౌస్ వద్ద ట్రక్కుతో తెలుగు సంతతి యువకుడి బీభత్సం (REUTERS)

వాష్టింగన్‍(Washington)లోని అమెరికా అధ్యక్ష భవనం ‘‘వైట్‍హౌస్’ వద్ద ఓ 19 ఏళ్ల యువకుడు బీభత్సం సృష్టించాడు. ఉద్దేశపూర్వకంగానే ట్రక్కుతో సెక్యూరిటీ బ్యారియర్‌ను ఢీకొట్టాడు. వైట్‍హౌస్‍లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. వైట్ హౌస్ భద్రతా పోలీసులు వెంటనే అతడిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని కందుల సాయివర్షిత్‍గా గుర్తించారు. వర్షిత్ తెలుగు సంతతికి చెందిన వ్యక్తి. ట్రక్కుతో బారియర్‌ను ఢీకొట్టిన తర్వాత స్వస్తిక ఉండే నాజీ జెండాను సాయివర్షిత్ ఊపాడు. అమెరికా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తాను ఆరు నెలలుగా ప్లాన్ చేస్తున్నానని, అందుకు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ను చంపేందుకు కూడా వెనుకాడనని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల విచారణలో సాయివర్షిత్ చెప్పాడని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇవే.

సాయివర్షిత్ అమెరికాలోని మిస్సౌరీ(Missouri)లోని చెస్ట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్నాడు. ప్లాన్ ప్రకారమే అక్కడి నుంచి వాషింగ్టన్ వచ్చి వైట్‍హౌస్ దగ్గర బీభత్సం చేశాడు. ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కునేందుకు తాను ఆరునెలలుగా ప్లాన్ చేస్తున్నానని అధికారులకు అతడు చెప్పాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ఘటన గురించి అధికారులు వివరాలు వెల్లడించారు.

నెలల ప్లానింగ్ తర్వాత సెయింట్ లూయిస్‍ నుంచి వన్‍వే టికెట్‍పై తాను వాషింగ్టన్ వచ్చానని సర్వీస్ సీక్రెట్ ఏజెంట్ అధికారులతో సాయివర్షిత్ చెప్పాడు. “అధికారాన్ని చేజిక్కించుకొని, దేశ బాధ్యతలను చేపట్టాలనే కోరికతో వైట్ హౌస్‍లోకి వెళ్లాలనుకున్నాను. ఒకవేళ అందుకు అవసరమైతే అధ్యక్షుడినైనా చంపేస్తా” అని సాయివర్షిత్ అన్నాడని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల చార్జెస్‍లో ఉంది. తాను నాజీల గొప్ప చరిత్రను ఆరాధిస్తానని, అందుకే తన వెంట నాజీ జెండాను తీసుకొచ్చినట్టు వెల్లడించారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వర్షిత్ తీసుకొచ్చిన ట్రక్కులో ఆయుధాలు కూడా లేవు. ఆ U-Haul టక్కును సాయివర్షిత్.. వాషింగ్టన్‍లోనే అద్దెకు తీసుకున్నాడు. దేశాధ్యక్షుడి ప్రాణాలకు హానీ కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఆయుధాల వినియోగం సహా సాయివర్షిత్‍పై వివిధ నేరాలను యూఎస్ పార్క్ పోలీసులు నమోదు చేశారు.

చెస్ట్ ఫీల్డ్ పరిధిలోని సెయింట్ లూయిస్ సిటీకి చెందిన సాయివర్షిత్ మార్కుటే సీనియర్ హైస్కూల్ నుంచి 2022లో గ్రాడ్యుయేషన్ చేశాడు. డేటా అనలటిక్స్ కెరీర్‌పై ఆసక్తి ఉందని అతడి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‍లో ఉంది. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజెస్‍లో అనుభవం ఉందని కూడా ఉంది.

IPL_Entry_Point