Vivek Ramaswamy: రిపబ్లికన్లలో ట్రంప్ తరువాత మన వివేక్ రామస్వామినే టాప్
Vivek Ramaswamy: అమెరికాలోని రిపబ్లికన్లలో అధ్యక్ష అభ్యర్థులకు సంబంధించి అత్యంత పాపులర్ నాయకుల్లో రెండో వ్యక్తిగా భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి నిలిచారు.
Vivek Ramaswamy: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అని సీఎన్ఎన్ పోల్ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా, ఇంతకుముందు ట్రంప్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కనిపించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ఓటింగ్ షేర్ గణనీయంగా క్షీణించింది. ఆయన ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు. డిసాంటిస్ కు జులై నెలలో రిపబ్లికన్ల నుంచి 26% సపోర్ట్ లభించగా, ఇప్పుడది 6 శాతానికి తగ్గింది.
ఇప్పటికీ ట్రంపే టాప్
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థుల్లో ఇప్పటికి అత్యంత ఆదరణ, పాపులారిటీ ఉన్న నేతగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సీఎన్ఎన్ పోల్ లో ఆ విషయం మరోసారి నిర్ధారణ అయింది. దాదాపు 39% రిపబ్లికన్ల మద్దతుతో ఆయన అధ్యక్ష అభ్యర్థి రేసులో దూసుకుపోతున్నారు. ఆయనకు సమీపంలో ఎవరూ లేరు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే ప్రక్రియలో తొలి అంకమైన ప్రైమరీ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. అప్పటివరకు ఈ అధ్యక్ష అభ్యర్థులకు లభించే మద్దతులో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రంప్ నకు మద్దతిచ్చే వారిలో మనసు మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
రెండో స్థానంలో వివేక్
వివేక్ రామస్వామికి ముఖ్యంగా యువ ఓటర్ల నుంచి, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నవారి నుంచి, రిపబ్లికన్లుగా రిజిస్టర్ చేసుకోనివారి నుంచి ఎక్కువ సపోర్ట్ లభిస్తోంది. మోడరేట్ల మద్దతు ఎక్కువగా నిక్కీ హేలీ సంపాదించారు. వివేక్ రామస్వామికి 13% రిపబ్లికన్ల మద్దతు లభిస్తోంది.
మూడో స్థానంలో నిక్కీ హేలీ..
అత్యంత ప్రజాదరణ పొందిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థుల జాబితాలో.. రెండో స్థానంలో ఉన్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి తరువాత.. మరో భారతీయ అమెరికన్ అభ్యర్థి మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ మూడో స్థానంలో ఉన్నారు. ఆమెకు 12% రిపబ్లికన్ల మద్దతు లభించింది. నాలుగో స్థానంలో 11% ఓట్లతో న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఐదో స్థానంలో 6% సపోర్ట్ తో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ఉన్నారు.