Mumbai rains: ముంబైలో కుంభవృష్టి; విమానాల రాకపోకలకు అంతరాయం
Published Jul 25, 2024 03:16 PM IST
- Mumbai rains: ముంబై, పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైకి విమానాల రాకపోకల్లోనూ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన సంస్థలు ముంబై ఫ్లైట్స్ ను రద్దు చేయడమో లేక రీ షెడ్యూల్ చేయడమో చేశాయి.
ముంబైలో కుంభవృష్టి; విమానాల రాకపోకలకు అంతరాయం
Mumbai rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై తడిసి ముద్దైంది. రహదారులు జలమయమయ్యయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసరం అయితేనే ఇళ్లు, లేదా ఆఫీస్ ల నుంచి బయటకు రావాలని బీఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలో తమ విమానాల షెడ్యూల్లో జాప్యం జరుగుతోందని దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (indigo) తెలిపింది. ప్రయాణీకులకు రియల్ టైమ్ అప్ డేట్లను అందించడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే విమానాశ్రయానికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ వారు వెళ్లాల్సిన విమానం టైమింగ్స్ ను చెక్ చేసుకోవాలని సూచించింది. కార్యకలాపాలు సజావుగా సాగేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, వాతావరణం మెరుగుపడిన తర్వాత ఈ జాప్యం గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నామని ఇండిగో తెలిపింది.
ఎయిర్ ఇండియా హెచ్చరిక
విమాన ప్రయాణ వేళల్లో చోటు చేసుకున్న అంతరాయాల గురించి ఎయిరిండియా (Air India) కూడా తన ప్రయాణీకులను అప్రమత్తం చేసింది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తవచ్చని, అందువల్ల ప్రయాణీకులు విమానాశ్రయానికి త్వరగా బయల్దేరాలని సూచించింది. అలాగే, విమానాశ్రయానికి బయల్దేరే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఎయిరిండియా సలహా ఇచ్చింది.
రాకపోకలు నిలిపేశారు..
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా గురువారం ఉదయం ముంబై (Mumbai) విమానాశ్రయంలో విమానాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. ఉదయం 10:55 గంటలకు 1000 మీటర్ల వద్ద విజిబిలిటీ, 1200 మీటర్ల వద్ద రన్వే విజువల్ రేంజ్ (RVR) నమోదైన తరువాత సుమారు 20 నిమిషాల అనంతరం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
మహారాష్ట్రలో భారీ వర్షాలు
మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో, ముఖ్యంగా ముంబై, పుణె, థానే, కొల్హాపూర్, సాంగ్లీలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరద పరిస్థితిని ఈ రోజు తెల్లవారుజాము నుంచి తన కార్యాలయం నుంచి సమీక్షిస్తున్నానని మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. సహాయక చర్యల్లో జాప్యం లేకుండా ప్రజలకు అవసరమైన సహాయాన్ని వీలైనంత త్వరగా అందించాలని అన్ని జిల్లాల విపత్తు నిర్వహణ వ్యవస్థ, సంబంధిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.