Pune Rains : పుణెలో భారీ వర్షాలు.. నలుగురు మృతి.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు-4 dead in rain related incidents in pune low lying areas inundated people being evacuated check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pune Rains : పుణెలో భారీ వర్షాలు.. నలుగురు మృతి.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Pune Rains : పుణెలో భారీ వర్షాలు.. నలుగురు మృతి.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Anand Sai HT Telugu
Jul 25, 2024 01:13 PM IST

Pune Rains : పుణెలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన కారణంగా నలుగురు మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

పుణెలో భారీ వర్షాలు
పుణెలో భారీ వర్షాలు

మహారాష్ట్రలోని పుణెలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం నలుగురు మృతి చెందారు. మరోవైపు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లు, నివాస సముదాయాలు నీట మునిగాయి. దీంతో ప్రజలను ఖాళీ చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ పుణె జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పుణె నగరంతో పాటు జిల్లాలోని వెల్హా, ముల్షి, భోర్ తాలూకాలు, ఖడక్వాస్లా సహా పలు ఆనకట్టల పరీవాహక ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలైన సింహగఢ్ రోడ్, బావ్ధాన్, బనేర్, డెక్కన్ జింఖానాలో వరదలు, ముంపునకు గురయ్యాయి.

నీటి విడుదల

వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు అగ్నిమాపక దళం, పుణె మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం ప్రయత్నాలు ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఖడక్వాస్లా డ్యామ్ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల నేపథ్యంలో జలాశయం నుంచి నీటిని విడుదల చేసినట్లు పుణె జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే తెలిపారు. కడక్వాస్లా డ్యామ్ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో 35 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నామని, ఇది 45 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని తెలిపారు. నీటి ప్రవాహం కారణంగా ముత్తా నది వెంబడి ఉన్న పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నలుగురు మృతి

పుణెలో కురిసిన వర్షాలకు గురువారం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని దక్కన్ ప్రాంతంలో తోపుడు బండిని తరలించే ప్రయత్నంలో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో మరణించగా, ముల్షి తహసీల్ లోని తహ్మిని ఘాట్ సెక్షన్ లో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలైనట్లు జిల్లా అధికారులు తెలిపారు.

విరిగిపడ్డ కొండచరియలు

జిల్లా యంత్రాంగం, స్థానిక పోలీసులు రోడ్డుపై ఉన్న శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారని, దానిని తొలగించిన తర్వాత రహదారి వాహనాల రాకపోకలకు తెరిచి ఉంటుందని పౌడ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ మనోజ్ యాదవ్ చెప్పారు. మరో ఘటనలో లావాసా ప్రాంతంలోని ఓ బంగ్లాలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖేడ్, జున్నార్, అంబేగావ్, వెల్హా, ముల్షి, మావల్, భోర్, హవేలీ తాలూకాలు, పింప్రి చించ్వాడ్‌తో పాటు పుణె నగర ప్రాంతంలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ఐఎండీ రెడ్ అలర్ట్

ముందు జాగ్రత్త చర్యగా వరదలు, ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే 24 గంటల పాటు పుణె జిల్లాకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు జిల్లాలోని లోనావాలా హిల్ స్టేషన్ సమీపంలోని మాలావ్లీ ప్రాంతంలోని రిసార్టులు, బంగ్లాల్లో వరదల కారణంగా చిక్కుకున్న 29 మంది పర్యాటకులను బుధవారం సాయంత్రం తరలించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వర్ష పరిస్థితిపై ప్రభుత్వం సమీక్షించి అన్ని రకాల సహాయాన్ని అందించాలని జిల్లా అధికారులను, పురపాలక యంత్రాంగాన్ని ఆదేశించారు.

Whats_app_banner