Bogatha Waterfall: బొగత వరద నీటిలో బీటెక్ స్టూడెంట్ మృతి, విషాదంగా మారిన విహార యాత్ర
Bogatha Waterfall: చిరుజల్లుల్లో వాటర్ ఫాల్స్ అందాలు చూసి తరించేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు వరద నీటిలో గల్లంతయ్యాడు.
Bogatha Waterfall: స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు జలపాతం వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. వాటర్ ఫాల్స్ వద్ద ఉన్న నీళ్లలో దిగగా, వరద ఉధృతికి గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ నగరంలోని ఏనుమాముల మార్కెట్ ఏరియా సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన బొనగాని జశ్వంత్(19) స్థానిక వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలోని బొగత జలపాతం జలకళను సంతరించుకుంది.
పైనుంచి వచ్చే వరదతో బొగత పరవళ్లు తొక్కుతుండగా, ఆ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అక్కడి వస్తున్నారు. కాగా బొనగాని జశ్వంత్ కూడా తన స్నేహితులైన సాయి కిరణ్, నాగేంద్ర బాబు, సుశాంత్, వంశీ, గౌస్ తో కలిసి బొగత వాటర్ ఫాల్స్ చూసేందుకు మంగళవారం అక్కడికి వెళ్లాడు.
అంతా కలిసి అక్కడి చేరుకుని బొగత వాటర్ ఫాల్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే జశ్వంత్ తో పాటు మిగతా స్నేహితులంతా కలిసి వరద నీటిలో స్నానం చేసేందుకు అందులోకి దిగారు. కానీ అప్పటికే బొగత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పట్టు తప్పిన జశ్వంత్ నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు అతడిని పట్టుకునే లోగానే నీటిలో మునిగిపోయాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో జశ్వంత్ స్నేహితులు కేకలు వేయడం మొదలు పెట్టారు.
విషయం గమనించి అక్కడికి వచ్చిన పర్యాటకులు కూడా జశ్వంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వెంకటాపురం సీఐ బండార్ కుమార్, ఎస్సై తిరుపతి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు అర గంట పాటు గాలించగా చివరకు జశ్వంత్ మృతదేహం లభ్యమైంది. కాగా సరదాగా తోటి మిత్రులతో కలిసి బొగత అందాలను చూసేందుకు వచ్చిన యువకుడు అదే వరద నీటిలో పడి ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఉగ్రరూపం దాల్చిన బొగత
ములుగు జిల్లాతో పాటు ఛత్తీస్ గడ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువన కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతానికి వరద తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బొగత వాటర్ ఫాల్స్ జలకళను సంతరించుకున్నాయి. దీంతో బొగత అందాలను చూసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తున్నారు.
ఓ వైపు వరద ప్రవాహంతో బొగత ఉధృతంగా ప్రవహిస్తుండగా, ప్రమాదాల నివారణ కోసం అధికారులు అక్కడికి ఎంట్రీ కూడా నిషేధించారు. కానీ వాటర్ ఫాల్స్ కు కొద్దిదూరంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చిన యువకులు స్నానాల కోసమని నీటిలో దిగుతుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా అనుమతిలేని చోట నీటిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీస్ అదికారులు సూచిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)