Spiderman Arrest : కారు బానెట్‌పై స్పైడర్ మాన్.. స్టేషన్‌కు పట్టుకొచ్చిన పోలీసులు-spiderman arrested for violating traffic rules driving dangerously on delhi streets more details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Spiderman Arrest : కారు బానెట్‌పై స్పైడర్ మాన్.. స్టేషన్‌కు పట్టుకొచ్చిన పోలీసులు

Spiderman Arrest : కారు బానెట్‌పై స్పైడర్ మాన్.. స్టేషన్‌కు పట్టుకొచ్చిన పోలీసులు

Anand Sai HT Telugu
Jul 25, 2024 10:45 AM IST

Spiderman Arrest : ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు స్పైడర్ మాన్ డ్రెస్ ధరించి కారు బానెట్‌పై రైడింగ్ చేశాడు. దీంతో అతడిని స్టేషన్‌కు పిలిపించి పోలీసులు భారీ జరిమానా విధించారు.

స్పైడర్ మాన్ అరెస్టు
స్పైడర్ మాన్ అరెస్టు

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇలా చేసి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసిన పట్టించుకోవడం లేదు. దీంతో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఓ వ్యక్తి స్పైడర్ మాన్ డ్రెస్ ధరించి కారుపై కూర్చొని వెళ్లాడు.

స్పైడర్‌మ్యాన్‌గా మారిన ఓ యువకుడు కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఈ వీడియో ప్రతిచోటా వైరల్ అయింది. ఈ విషయం దిల్లీ పోలీసులకు తెలిసింది. కంప్లైంట్ వచ్చింది. దీంతో అతడిపై వేగంగా చర్యలు తీసుకున్నారు. స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు.

దిల్లీలోని రోడ్లపై కదులుతున్న కారు బానెట్‌పై స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న వ్యక్తి రైడింగ్ చేశాడు. దీంతో దిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. స్పైడర్‌మ్యాన్‌ కాస్ట్యూమ్‌లో ఉన్న వ్యక్తిని నజఫ్‌గఢ్‌కు చెందిన ఆదిత్య (20)గా గుర్తించారు. కారు డ్రైవర్‌ను మహవీర్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న గౌరవ్‌ సింగ్‌ (19)గా గుర్తించారు.

ప్రమాదకరమైన డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వంటి వాటిపై వాహన యజమానులు, డ్రైవర్లపై గరిష్టంగా రూ.26,000 జరిమానా విధించవచ్చు. జరిమానా లేదా జైలు శిక్ష, రెండూ విధించబడతాయి. ఈ మేరకు అతడిపై చర్యలు తీసుకున్నారు.

దిల్లీలో ఇది మొదటి కేసు ఏం కాదు. ఈ స్వయం ప్రకటిత సూపర్‌హీరోలకు దిల్లీ రోడ్ల మీద బాగా అలవాటు అయిందనే చెప్పాలి. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అయితే పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపడుతున్నారు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కామిక్ పాత్రలు స్పైడర్‌మ్యాన్, స్పైడర్‌వుమన్ కాస్ట్యూమ్స్ ధరించి దేశ రాజధాని వీధుల్లో ప్రమాదకరమైన విన్యాసాలు చేసింది ఓ జంట. వారిని కూడా తీసుకొచ్చి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. 'ఇద్దరు వ్యక్తులు స్పైడర్‌మ్యాన్ దుస్తులు ధరించి బైక్ నడుపుతున్నారు. ఈ విషయంపై విచారణ నిర్వహించాం. మోటారు వెహికల్ (MV) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. హెల్మెట్ లేకుండా, అద్దం లేకుండా, లైసెన్స్ లేకుండా, ప్రమాదకరమైన డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ప్రదర్శించని నేరాలకు శిక్షించాం.' అని గతంలో ఓ పోలీస్ అధికారి తెలిపారు.

Whats_app_banner