Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్-air india flight with 180 flyers collides with tug tractor at runway in pune ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

HT Telugu Desk HT Telugu
May 17, 2024 03:26 PM IST

Air India: పుణె విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి స్వల్ప ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ కు సిద్ధమవుతుండగా, రన్ వే పై టగ్ ట్రాక్టర్ ను ఢీ కొన్నది. దాంతో, విమానం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదని ఎయిర్ ఇండియా తెలిపింది.

పుణే ఏర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
పుణే ఏర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

Air India: 180 మంది ప్రయాణికులతో పుణే నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానం గురువారం (మే 16) పూణే విమానాశ్రయం రన్ వేపై టగ్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. సుమారు 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం నోస్, ల్యాండింగ్ గేర్ సమీపంలోని టైరు దెబ్బతిన్నాయి. టగ్ ట్రాక్టర్ ను విమానం ఢీకొన్నప్పటికీ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ప్రయాణికులకు వేరే ఏర్పాట్లు

ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించేశారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా (Air India) తెలిపింది. వారికి పూర్తి రీఫండ్ లేదా కాంప్లిమెంటరీ రీషెడ్యూల్ ను ఏర్పాటు చేశామని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు ప్రారంభించింది. విమానం టాక్సీయింగ్ సమయంలో.. రన్ వే పై ఉన్న టగ్ ట్రక్ ఢీకొట్టినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రమాదంతో పుణే విమానాశ్రయంలో ఇతర విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం, ప్రమాదం జరిగిన విమానాన్ని మరమ్మతుల కోసం సర్వీసు నుండి తొలగించారు.

పుణే నుంచి ఢిల్లీకి వెళ్తుండగా..

‘‘పుణె నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన మా విమానానికి సంబంధించిన ఘటన పుష్ బ్యాక్ సమయంలో జరిగింది. తనిఖీల కోసం విమానాన్ని నిలిపివేసి, ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపి, విమానాన్ని రద్దు చేశాము. చివరకు ప్రయాణికులకు పూర్తి ఛార్జీలను తిరిగి చెల్లించి కాంప్లిమెంటరీ రీషెడ్యూల్ ఇచ్చాము. కనెక్టింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నవారిని ఇతర విమానయాన సంస్థల ద్వారా ఢిల్లీకి పంపించాము. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాము’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది.

Whats_app_banner