DGCA fines Air India: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో మద్యం మత్తులో శంకర్ మిశ్రా (Shankar Mishra) అనే వ్యక్తి సహ ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లేట్ గా స్పందించిన ఎయిర్ ఇండియా (Air India) ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో ఎయిర్ ఇండియా (Air India) వ్యవహరించిన తీరును డీజీసీఏ (Directorate General of Civil Aviation - DGCA) తీవ్రంగా తప్పుబట్టింది. ఎయిర్ ఇండియా (Air India) సిబ్బంది బాధితురాలితో వ్యవహరించిన విధానం అమానవీయంగా ఉందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అనుసరించాల్సిన విధి విధానాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు గానూ, ఎయిర్ ఇండియా (Air India) కు రూ. 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఏర్ పోర్ట్ రూల్స్ 1937 లోని రూల్ నెంబర్141 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా విధులను నిర్వర్తించని కారణంగా ప్రధాన పైలట్ లైసెన్స్ ను కూడా 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో Air India విమానంలో విధుల్లో ఉన్న సిబ్బందిని ఎయిర్ ఇండియా ఇప్పటికే సస్పెండ్ చేసింది.
తొలుత తప్పును ఒప్పుకుంటూ, క్షమించమని ఆ మహిళను వేడుకున్న శంకర్ మిశ్రా (Shankar Mishra).. ఆ తరువాత మాట మార్చాడు. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పరారీ అయిన మిశ్రా (Shankar Mishra).. అరెస్టైన తరువాత కోర్టులో కొత్త వాదనలు వినిపిస్తున్నాడు. విమానంలో ఆ వృద్ధ మహిళ తనపై తనే మూత్రం పోసుకుందని, ఆమెకు మూత్రాశయ సమస్య ఉందని, మూత్రాన్ని ఆమె కంట్రోల్ చేసుకోలేదని వాదించాడు. ఆమె కథక్ డ్యాన్సర్ అని, కథక్ డాన్సర్లలో ఈ సమస్య సాధారణంగా ఉంటుందని Shankar Mishra వాదించాడు. అలాగే, ఆమె కూర్చున్న 9 సీ సీటు వద్దకు వెళ్లి మూత్రం పోయడం సాధ్యం కాదని వాదించాడు.