Independence day 2023 : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను స్థాపించింది ఓ బ్రిటీష్ పౌరుడని మీకు తెలుసా?
07 August 2023, 16:06 IST
- Independence day 2023 : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. నేటి భారతంలో ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సోనియా- రాహుల్ గాంధీలు, ఉనికిని చాటుకునేందుకు పార్టీ చేస్తున్న విశ్వప్రయత్నాలు. కానీ దేశ స్వాంత్ర్య ఉద్యమంలో పార్టీది కీలక పాత్ర! 2023 స్వాతంత్ర్య దినోత్సం వేళ ఐఎన్సీపీపై ప్రత్యేక కథనం మీకోసం..
స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర..
Independence day 2023 : ఇండియాను ఆక్రమించుకున్న తర్వాత బ్రిటీషర్లు చేసిన అన్యాయం గురించి మనం నిత్యం మాట్లాడుకుంటూనే ఉంటాము. అయితే.. బ్రిటీషర్లలో కూడా కొందరు భారత దేశం కోసం, ప్రజల కోసం ఆలోచించిన వారు ఉన్నారు. వారిలో ఒకరు ఆలన్ ఆక్టేవియన్ హ్యూమ్! శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓ బ్రిటీష్ వ్యక్తి స్థాపించాడని చెబితే మీరు నమ్మగలరా? అవును. రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ ఆలెన్ ప్రోత్సాహంతోనే ఐఎన్‌సీ పుట్టుకొచ్చింది. ఇండియా అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాక్షించారు. అందరికి విద్య లభించాలని, బ్రిటీష్ రాజ్‌తో రాజకీయ చర్చలు జరిగే విధంగా ఓ వేదిక ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆయన ఆలోచనల నుంచి ఆవిర్భవించిందే.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.
1885 డిసెంబర్ 28న బాంబేలో ఐఎన్‌సీ తొలి సమావేశం జరిగింది. 72మంది సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాబాయ్ నవ్రోజీ వంటి ప్రముఖ నేతలు ఇందులో సభ్యులుగా చేరారు. నాటి సభలో.. ఉమేశ్ చంద్ర బెనర్జీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
అయితే.. స్థాపించిన తొలినాళ్లల్లో లక్ష్యాలను ఛేదించడంలో ఐఎన్‌సీ విఫలమైందని చెబుతుంటారు. పార్టీ ప్రజల్లోకి వెళ్లడంలో పూర్తిగా విఫలమైందని విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో చిన్న బృందంగా ఉండిపోయిన కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు ఎక్కువగానే ఉండేవని మాటలు వినిపించేవి.
మహాత్ముడి రాకతో.. కాంగ్రెస్‌కు వైభవం..!
Indian National congress : 20వ శతాబ్దంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. స్వాతంత్ర్యం కోసం పోరాటం అప్పుడప్పుడే మొదలైంది. కానీ మహాత్మా గాంధీ రాకతో కాంగ్రెస్‌కు వైభవం వచ్చింది! దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన తర్వాత 1915లో కాంగ్రెస్‌లో చేరారు గాంధీ. దక్షిణాఫ్రికాలో ఆయన సాధించిన ఘనతలు, ప్రజల కోసం చేసిన పోరాటం వివరాలు అప్పుడే భారతీయులకు చేరాయి.
మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అవ్వలేదు. కానీ అనాధికారికంగా పార్టీకి ఆయనొక ఐకాన్, ఆధ్యాత్మిక గురువు! స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన తన విలువను చాటుకుంటూ వచ్చారు. 1917-18 మధ్యలో చంపారణ్ సత్యాగ్రహం, ఖడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ వంటి వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి బ్రిటీషర్లను నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నేహ్రు, రాజేంద్ర ప్రసాద్, ఖాన్ అబ్దుల్ జాఫర్ ఖాన్, రాజగోపాలచారి, జయప్రకాశ్ నారాయణ్, మౌలానా అబ్దుల్ కలాం అజాద్ వంటి దిగ్గజ నేతలు.. గాంధీ వెంటే నడిచారు.
స్వాతంత్ర్యానికి ముందు- ఆ తర్వాత..!
భారత దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం! వివిధ మతాల ప్రజలు కలిసిగట్టుగా జీవించే దేశం ఇది. కానీ అందరిని ఒకతాటిపైకి తీసుకురావడం అత్యంత క్లిష్టమైన పని. కోట్లాది మందిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చి, వారిని ఒక్క చోట చేర్చి, బ్రిటీష్ వంటి శక్తివంతమైన శత్రువుపై పోరాటం చేయడం అండే చిన్న విషయం కాదు! కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. దీనిని సాధించగలిగింది. ఇందుకు పార్టీలోని వందలాది మంది దిగ్గజ నేత పాత్ర ఉంది. గాంధీ అడుగుజాడల్లో, ఆయన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిలో స్ఫూర్తినింపారు నేతలు. వీరి ప్రయత్నాలకు ప్రతిఫలమే ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం! ఒకానొక దశలో ప్రజల ఉద్యమాన్ని చూసి బ్రిటీషర్లే ఆశ్చర్యపోయి ఉంటారు. వారందరి వెనుక నిలబడింది కాంగ్రెస్. ప్రజల ఐకమత్యానికి, కాంగ్రెస్ శక్తికి దాసోహమన్న బ్రిటీషర్లు.. దేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అలా.. 1947 ఆగస్టు 15న ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది.
Role of Indian National congress in Independence : స్వాతంత్ర్య తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. 1952 నుంచి 1977 వరకు ఏకథాటిగా దేశాన్ని పాలించింది. 1980-1989లో కూడా ప్రభుత్వంలో కొనసాగింది. 1991, 2004,2009 ఎన్నికల్లో విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి ప్రధానులతో కాంగ్రెస్ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.
అయితే.. ప్రస్తుతం దేశంలో ఉన్న కాంగ్రెస్.. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించిన పార్టీ కాదు! ఆయన మరణం తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది. 1969లో ఇందిరా గాంధీ బయటకు వచ్చేశారు. ఆమెతో పాటు వచ్చిన వారిని కాంగ్రెస్ (ఆర్) సభ్యులుగా పిలిచేవారు. మిగిలిన వారిని కాంగ్రెస్ (ఓ) సభ్యులు అని పేర్కొనేవారు. కానీ వీరికి మద్దతు కరువైంది. ఇందిరా గాంధీ కాంగ్రెస్‌కు రోజురోజుకు మద్దతు పెరుగుతూ వచ్చింది. చివరికి.. కాంగ్రెస్ (ఓ).. విపక్షాలతో కలిసిపోయింది. ఈ కూటమికి జనతా పార్టీ అని పేరు వచ్చింది.
ఆ తర్వాత కాంగ్రెస్ ఆర్ కూడా ఎక్కువ సంవత్సరాలు నిలువలేదు! ఎమర్జెన్సీ తర్వాత తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ (ఐ)గా ప్రజల్లోకి వెళ్లారు ఇందిరా గాంధీ. ఇక్కడ 'ఐ' అంటే ఇందిర. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చారు. 1984 సార్వత్రిక ఎన్నికల వేళ.. కాంగ్రెస్ (ఐ)ని అసలైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌గా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది ఎన్నికల సంఘం.
Indira Gandhi Congress : 1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్‌లో పెద్ద కుదుపే వచ్చింది. పెద్దగా రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. 1991లో జరిగిన బాంబు దాడిలో ఆయన సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహ రావు.. మన్మోహన్ సింగ్‌తో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు. కీలక విధానాలను రూపొందించి, దేశాన్ని ఆర్థికపరంగా నిలబెట్టారు. ఆ తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్‌లు కూడా పీవీ నరసింహ రావు తీసుకొచ్చిన విధానాలను అనుసరించారు.
కాంగ్రెస్ పతనం.. ఉనికి కోసం ప్రయత్నం!
2009 వరకు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌కు.. 2014లో తేరుకోలేని దెబ్బ తగిలింది! అదే 'మోదీ మేనియా'. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ.. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌పై అప్పటికే ఉన్న అసంతృప్తికి గొంతుకగా నిలిచింది. మోదీ దెబ్బకు కాంగ్రెస్ కంచుకోటలు కూలిపోయాయి. దేశంలో అప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు.
Rahul Gandhi Congress : 2014లో కాంగ్రెస్ కష్టాలు తీవ్రమయ్యాయి. ఒక్కో రాష్ట్రంలో కమలం వికశిస్తూ వస్తుంటే.. హస్తం కిందపడుతూ వచ్చింది. ప్రజల్లో నమ్మకం కోల్పోవడం మాట పక్కన పెడితే.. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నిత్యం వార్తల్లో నిలిచేది. 2019 సార్వత్రికంతో పార్టీపై మరో దెబ్బ పడింది! శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన పార్టీకి ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పరిస్థితుల్లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. భారత్ జోడో యాత్ర, కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం వంటి పరిణామాలతో కాంగ్రెస్ పుంజుకుంటోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరి మోదీకి, బీజేపీకి ఎదురీది.. 2024లో కాంగ్రెస్ ఏమరకు ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి!