Emergency Teaser: ‘ఎమర్జెన్సీ’ టీజర్ రిలీజ్.. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్
Emergency Teaser: ‘ఎమర్జెన్సీ’ సినిమా టీజర్ వచ్చేసింది. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తోంది.
Emergency Teaser: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ చేస్తున్న ‘ఎమర్జెన్సీ’ సినిమాపై చాలా హైప్ ఉంది. దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనుంది కంగనా రనౌత్. అప్పటి దేశ ప్రధాన మంత్రి, దివంగత ఇందిరా గాంధీ పాత్రను ఈ ఎమర్జెన్సీ సినిమాలో పోషిస్తోంది కంగనా రనౌత్. అలాగే, ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తోంది కంగనా. నిర్మాతగానూ ఉంది. దీంతో ‘ఎమర్జెన్సీ’ చిత్రంపై ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయింది కంగనా. ఆమె మేకోవర్ అచ్చం ఇందిరా గాంధీని పోలినట్టే ఉంది. ఈ ఎమర్జెన్సీ మూవీ టీజర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్లలోనూ పోస్ట్ చేసింది కంగనా. వివరాలివే..
“ప్రొటెక్టరా లేదా డిక్టెటరా? సొంత ప్రజలపై మన దేశ నాయకురాలు యుద్దం ప్రకటించినప్పటి చీకటి రోజులకు సాక్ష్యమిది. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది” అనే క్యాప్షన్‍తో ఎమర్జెన్సీ సినిమా హిందీ టీజర్‌ను కంగనా రనౌత్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.
1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించనట్టుగా దినపత్రిక చూపించడంతో ఎమర్జెన్సీ టీజర్ మొదలైంది. అల్లర్లు జరిగినట్టుగా కూడా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ జైలులో ఉన్నట్టుగా ఉంది. “ఇది మన మరణం కాదు.. దేశానిది” అనే డైలాగ్ అనుపమ్ ఖేర్ చెబుతారు. దివంగత జయప్రకాశ్ నారాయణ్ పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు అనుపమ్ ఖేర్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలను ఈ టీజర్‌లో చూపించింది కంగనా. టీవీలు ప్రసారాలు బంద్ అయినట్టు, ప్రజలను తుపాకులతో కాల్చినట్టు సీన్లు ఈ టీజర్‌లో ఉన్నాయి. అనంతరం ఇందిరా గాంధీ పాత్ర పోషించిన కంగనా రనౌత్ వాయిస్ ఓవర్ వస్తుంది. “ఈ దేశాన్ని రక్షించడం నుంచి నన్ను ఎవరూ ఆపలేరు. ఎందుకంటే, ఇండియా అంటే ఇందిరా.. ఇందిరా అంటే ఇండియా” అనే వాయిస్ ఓవర్‌తో ఎమర్జెన్సీ టీజర్ ముగిసింది.
2024 లోక్‍సభ ఎన్నికలకు ముందు వస్తుండటంతో ఈ ఎమర్జెన్సీ సినిమాపై రాజకీయ దుమారం రేగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్‌తో పాటు సతీశ్ కౌశిక్, మహిమ చౌదరీ, మిలింద్ సోమన్, శ్రేయస్ తల్పాడే.. ఎమర్జెన్సీ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కంగన రనౌత్, రేణు పట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, దర్శకత్వ బాధ్యతలను కూడా రంగనా రనౌత్ వహించింది. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది.